- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేయూత పెన్షన్లలో భారీ ప్రక్షాళన.. అనర్హులపై పెరిగిన ఫోకస్!
చేయూత పెన్షన్ పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ఫలితాలు ఇస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : చేయూత పెన్షన్ పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ఫలితాలు ఇస్తోంది. బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న 19.04 లక్షలకుపైగా లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు దాదాపు 15.93 లక్షల మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం లబ్ధిదారుల్లో 83.88 శాతం మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. ఇంకా మూడు లక్షలకుపైగా మంది ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ద్వారా వేలాది అనర్హులను గుర్తించారు. ప్రజాధనాన్ని కాపాడుతూ, నిజమైన అర్హులకు సంక్షేమ ఫలాలు చేరేలా ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. అనర్హులు అనేక మంది చేయూత పింఛన్లు పొందుతున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను చేపట్టారు. దీనికి ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేసి ఇచ్చారు.
ఇంటింటికీ వెళ్లి పరిశీలన
లైవ్ అథెంటికేషన్ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే మరణించిన 41 వేల మందికి పైగా లబ్ధిదారుల పేర్లపై పెన్షన్లు కొనసాగుతున్న విషయం వెలుగులోకి వచ్చాయి. సంబంధిత కుటుంబ సభ్యులు కూడా వారి మరణాన్ని ధృవీకరించారు. అదే విధంగా సుమారు 14 వేల మంది లబ్ధిదారులు ఎక్కడా గుర్తించలేని పరిస్థితి (నాట్ ట్రేసబుల్)లో ఉన్నట్టు తేలింది. మరో 3,475 మంది ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణలో పెన్షన్లు పొందుతున్నట్టు గుర్తించారు. అలాగే వంద మందికి పైగా లబ్ధిదారులు స్వచ్ఛందంగా తమకు పెన్షన్ అవసరం లేదని చెప్పారు. ఉపాధి లేదా ఇతర ఆదాయ వనరులు లభించడం వల్ల వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా సుమారు 10 వేల మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు రద్దు అయినట్టు వెలుగులోకి వచ్చింది. డూప్లికేట్ లేదా బహుళ ఆధార్ కార్డుల కారణంగా ఈ ఆధార్‌లు చెల్లుబాటు కాకపోవడం వల్ల వారి అర్హతలను కూడా ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఇప్పటివరకు మొత్తం లబ్ధిదారుల్లో 83.88 శాతం మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. ఇంకా మూడు లక్షలకుపైగా మంది ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. లబ్ధిదారుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇప్పటికే గడువును వారం రోజుల పాటు పొడిగించింది. మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్లకే అధికారులు వెళ్లి లైవ్ అథెంటికేషన్ నిర్వహిస్తున్నారు. గతంలోనూ చేయూత పింఛన్లలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి ఇస్తున్నట్టుగా గుర్తించారు. ప్రభుత్వం నేరుగా బ్యాంకుల అకౌంట్లో చేయూత డబ్బులు జమ చేస్తుంది. అయితే వారు చనిపోయినా, ఇతర రాష్ట్రాలకు వెళ్లినా కూడా వారి సమాచారం లేకపోవడంతో వారి అకౌంట్లో డబ్బులు జమ అవుతూనే ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి నగరాల్లో చేయూత లబ్ధిదారుల వివరాలపై సర్వే కొనసాగిస్తున్నారు. ఇలా వీరు కూడా వేల సంఖ్యలో ఉన్నారని, వీరికి అడ్డుకట్ట వేయడం ద్వారా అనర్హులైన వారిలో కొత్త వారికి పింఛన్లు ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ సర్వే పూర్తి కానుంది.






