మరోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

by Malleboina Mahesh |

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం! టెర్మినల్, లగేజీల్లో బాంబు ఉందన్న మెయిల్‌తో తనిఖీలు. దేశవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతుండటంతో అధికారుల హై అలర్ట్.

మరోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా దుండగులు దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రాంతాలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు (Bomb threats) చేస్తూనే ఉన్నారు. తాజా సోమవారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిల్ ఒక్కసారిగా కలకలం రేపింది. టెర్మినల్ లోపల, ప్రయాణికుల లగేజ్ బ్యాగుల్లో బాంబులు అమర్చామంటూ వచ్చిన ఈ సందేశంతో ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది (CISF), పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో విమానాశ్రయం నలుమూలలా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు టెర్మినల్ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా కేవలం విమానాశ్రయాలకే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పాఠశాలలు, కోర్టులు, హాస్పిటళ్లు మరియు ప్రభుత్వ భవనాలకు ఇలాంటి బాంబు బెదిరింపు మెయిళ్లు రావడం ఒక ఆందోళనకరమైన ట్రెండ్‌గా మారింది. ఇటీవల ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్ అసెంబ్లీ, బెంగళూరులోని పలు కీలక ప్రాంతాలకు కూడా ఇలాంటి ఫేక్ మెయిల్స్ వచ్చాయి. చాలా సందర్భాల్లో ఇవి విదేశీ సర్వర్ల ద్వారా లేదా టెక్నాలజీని ఉపయోగించి పంపుతున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ బెదిరింపుల వెనుక ఉద్దేశం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం మరియు భద్రతా వ్యవస్థలను అయోమయానికి గురి చేయడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిరంతరం వస్తున్న ఈ ఫేక్ కాల్స్ మరియు మెయిళ్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Next Story