ఈ ఏడాది భారత్‌లో 24 కొత్త వాహనాలను విడుదల చేయనున్న బీఎమ్‌డబ్ల్యూ!

by Disha Web Desk 12 |
ఈ ఏడాది భారత్‌లో 24 కొత్త వాహనాలను విడుదల చేయనున్న బీఎమ్‌డబ్ల్యూ!
X

న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ ఈ ఏడాది దూకుడుగా వ్యవహరించనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికం జనవరి-మార్చిలో సెమీకండక్టర్ల కొరత, ఉక్రెయిన్ యుద్ధం సహా పలు సవాళ్లు ఉన్నప్పటికీ కార్ల అమ్మకాల్లో 25 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 41 శాతం వృద్ధిని సాధించినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే 2022 ఏడాది తమకు భారత్‌లో 'మెగా ఇయర్ 'గా ఉంటుందని కంపెనీ ఆశిస్తోంది. దేశీయ వినియోగదారుల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ సంస్థ ఈ ఏడాది భారత మార్కెట్లో 24 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. మే నెలలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4తో పాటు 19 కార్లను, సంస్థ అనుబంధ టూ-వీలర్ బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ విభాగంలో ఐదు మోటార్‌సైకిళ్లను తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది.

జనవరి-మార్చిలో కంపెనీ మొత్తం 2,815 యూనిట్ల కార్లను విక్రయించి 25.3 శాతం వృద్ధి సాధించింది. దీంతో సమీక్షించిన కాలం భారత్‌లో అత్యుత్తమ త్రైమాసికంగా నిలిచిందని కంపెనీ వెల్లడించింది. వీటిలో సెడాన్, ఎస్‌యూవీలు 2,636 యూనిట్లు కాగా, మినీ లగ్జరీ కాంపాక్ట్ కార్లు 179 అమ్ముడయ్యాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 41.1 శాతం పెరిగి 1,518 యూనిట్లకు పెరిగాయి. 'ప్రస్తుతం సరఫరా పరిమితంగా ఉంది. అయినప్పటికీ ఎక్కువగా అమ్మకాలు సాధించాం. అయితే, ఇప్పటికీ 2,500 కార్ల ఆర్డర్లు, 1,500 కంటే ఎక్కూ ద్విచక్ర వాహనాల కోసం ఆర్డర్లు ఇంకా డెలివరీ చేయలేదు. సమస్యలు లేకుండా డెలివరీలను నిర్వహించి ఉంటే అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉండేవని ' బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవా చెప్పారు.


Next Story