కౌంటింగ్‌కు ముందు బెంగాల్‌లో రక్తపాతం.. బీజేపీ జిల్లా కార్యదర్శి నివాసమే లక్ష్యంగా దాడి!

by Malleboina Mahesh |

నోపరాలో బీజేపీ నేత కుందన్ సింగ్ ఇంటిపై కాల్పులు! ఓట్ల లెక్కింపు వేళ బెంగాల్‌లో రాజకీయ సెగలు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.

కౌంటింగ్‌కు ముందు బెంగాల్‌లో రక్తపాతం.. బీజేపీ జిల్లా కార్యదర్శి నివాసమే లక్ష్యంగా దాడి!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు జరిగినప్పటి నుంచి బెంగాల్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అలర్లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర 24 పరగణాల జిల్లా నోపరాలో ఓట్ల లెక్కింపునకు కొద్ది గంటల ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శనివారం రాత్రి బీజేపీ జిల్లా సంస్థాగత కార్యదర్శి కుందన్ సింగ్ నివాసంపై ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు స్థానికంగా భయాందోళనలు కలిగించాయి. తృణమూల్ కాంగ్రెస్ ఓటమి భయంతోనే తమను బెదిరించడానికి ఆకాష్ చౌదరి, అమన్ అనే వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని, అయితే ఇటువంటి బెదిరింపులకు తాము భయపడబోమని కుందన్ సింగ్ స్పష్టం చేశారు.

ఈ ఘటనపై మాజీ ఎంపీ, నోపరా బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ మండిపడుతూ, నిందితులు ఎన్నికల సమయంలో డ్రగ్స్ విక్రయించారని, పోలీసు యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ సభ్యులను ఓట్ల లెక్కింపునకు వెళ్లకుండా అడ్డుకోవడమే ఈ దాడి ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని బారక్‌పూర్ పోలీస్ కమిషనరేట్ డీసీ (నార్త్) వాసిమ్ ఖాన్ వెల్లడించారు. వీరిని బారక్‌పూర్ సబ్ డివిజనల్ కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ నిమిత్తం 10 రోజుల కస్టడీ కోరనున్నట్లు ఆయన తెలిపారు.

Next Story