తెలంగాణలో 60 శాతం మున్సిపల్ స్థానాలు గెలవడమే బీజేపీ లక్ష్యం: రాంచందర్ రావు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-28 03:47:27  IST  )

మంగళవారం సాయంత్రం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణలో 60 శాతం మున్సిపల్ స్థానాలు గెలవడమే బీజేపీ లక్ష్యం: రాంచందర్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: మంగళవారం సాయంత్రం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ (Municipal Elections Schedule) విడుదలైంది. మొత్తం రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు (Municipal Corporations) సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం నేటి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 11న ఒకే దశలో పోలింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 13న ఫలితాలను వెల్లడించనున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం కసరత్తు మొదలెట్టారు. ఈ క్రమంలో తాజా ఎన్నికల షెడ్యూల్ పై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు (State President N. Ramchandra Rao) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ వ్యూహాన్ని ప్రకటించారు.

రాష్ట్రంలోని 60 శాతం మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతున్నామని, కనీసం 5 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పార్లమెంట్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తాచాటామని, మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ (BJP) ఎప్పటి నుంచో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే ఈ రోజు సాయంత్రానికి అన్ని ప్రాంతాల నుంచి పూర్తిస్థాయి నివేదిక అందుబాటులోకి వస్తుందని. వెంటనే పార్టీ కమిటీ సమావేశంలో చర్చించి అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అలాగే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కేవలం ముస్లిం ఓటు బ్యాంకుపైనే ఆధారపడ్డాయని విమర్శించిన ఆయన.. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒకటేనని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ తన సత్తా చాటుతుందని ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Next Story