కేరళంలో బీజేపీ దూకుడు: 39 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల!

by Malleboina Mahesh |

కేరళ ఎన్నికల బరిలో బీజేపీ దూకుడు.. 39 మందితో రెండో జాబితా విడుదల! మహిళలు, కీలక నేతలకు చోటు. మోదీ, అమిత్ షా సమక్షంలో అభ్యర్థుల ఖరారు.

కేరళంలో బీజేపీ దూకుడు: 39 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల!
X

దిశ, వెబ్ డెస్క్: కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు కొనసాగిస్తూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 15న ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. దీంతో అసెంబ్లీ సమరం వేడెక్కుతున్న వేళ భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శిస్తోంది. గురువారం (మార్చి 19, 2026) ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుండి 39 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్రనేతల సమక్షంలో జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అనంతరం ఈ పేర్లను ఖరారు చేశారు. కాసరగోడ్ నుండి అశ్విని ఎం.ఎల్, అలప్పుజ నుండి ఎం.జె. జాబ్, కొల్లాం నుండి డాక్టర్ ఎన్. ప్రతాప్ కుమార్ వంటి కీలక నేతలకు ఈ జాబితాలో చోటు దక్కింది. నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం ద్వారా ఈసారి కేరళంలో పాగా వేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

మహిళలు, మేధావులకు ప్రాధాన్యం.. సర్వశక్తులూ ఒడ్డుతున్న కమల దళం!

ఈ రెండో జాబితాలో సామాజిక సమీకరణలతో పాటు మహిళలకు, మేధావులకు బీజేపీ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అశ్విని ఎం.ఎల్, పద్మశ్రీ ఎం, అశ్వతి గుప్త కుమార్, దీపా పుళక్కల్, రేణు సురేష్, వత్సల ప్రసన్న కుమార్ వంటి మహిళా నేతలకు అవకాశం కల్పించడం గమనార్హం. అలాగే మాజీ కీలక నేత కుమ్మనం రాజశేఖరన్ (అరన్ముల) వంటి అనుభవజ్ఞులను కూడా రంగంలోకి దించింది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పార్టీ కేడర్ సిద్ధమవుతోంది. కమ్యూనిస్టు, కాంగ్రెస్ కోటలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా 'మిషన్ కేరళంను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఈ జాబితాను బట్టి స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story