- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మతోన్మాద రాజకీయాలకు తెరలేపిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ : సీపీఐ
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు దక్షిణాదిలో తెలంగాణ కేంద్ర బిందువుగా మారిందని,

దిశ, తెలంగాణ బ్యూరో: ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు దక్షిణాదిలో తెలంగాణ కేంద్ర బిందువుగా మారిందని, రాష్ట్రంలో మతోన్మాద రాజకీయాలు చేసేందుకు ఆ శక్తులు పొంచి ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ హెచ్చరించారు. తెలంగాణలో మతతత్వ వ్యతిరేక శక్తులు మరింత సఖ్యతతో కలిసి పని చేయాలని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఎజెండాపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మగ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో మాట్లాడారు. దేశం తీవ్రమైన కల్లోలపరిస్థితులను ఎదుర్కొంటోందని, ఒకవైపు రాజ్యాంగం మరోవైపు సమాఖ్య విధానం తీవ్రమైన దాడులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.
నేషనల్ మానిటైజేషన్ పైప్ పేరుతో ప్రజల సంపదను కార్పొరేట్‌కు కట్టబెడుతున్నారని, ఇప్పటికే దేశంలోని పోర్టులు అదానీకి అప్పగించారని విమర్శించారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నదని, ఇప్పటికే ధరల సూచీలు పెరిగాయని, తాజాగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగిపోయాయని అన్నారు. వీటి ప్రభావం నిత్యావసరాలపై పడి సామాన్యుడి జీవితం దుర్భరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయాలు తగ్గుతుండడంతో పూడ్చుకునేందుకు ప్రభుత్వ రంగ ఆస్తులను తెగనమ్మేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం దేశభక్తితో కూడిన విధి అని తెలిపారు. ఇందుకు కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 28,29 తేదీల్లో తలపెట్టిన జాతీయ సమ్మె చారిత్రాత్మకం కాబోతుందన్నారు. అసలు సమస్యలను తప్పుదారి పట్టించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు మతతత్వాన్ని పెంచుతాయని, ఎన్నికల ప్రచారంలో స్వయంగా మోడీ, యోగిలే శ్మశానం, ఖబరస్థాన్ మధ్య జరుగుతున్న పోటీ అని రెచ్చగొట్టారని, ఉత్తర ప్రదేశ్ విజయం తరువాత ఆ ధోరణి మరింత పెరిగిందని అన్నారు.
మూడు నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమించిన రైతులతో చర్చలు జరిపేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కార్పొరేట్‌కు అనుకూలమైనదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను 85.7 శాతం సమర్ధించారని, 13.4 శాతమే వ్యతిరేకించారని సుప్రీం కోర్టుకు ఆ కమిటీ నివేదిక ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. రైతులు ఆన్ ఫోన్ ద్వారా ఈ అభిప్రాయం వెల్లడించారని కమిటీ సభ్యుడు అనిల్ జైసింగ్ గన్వత్ చెప్పారని, రైతులకు సెల్ ద్వారా అభిప్రాయం చెప్పడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరాశపరిచినప్పటికీ తెలంగాణలో సీపీఐ శ్రేణులు రెండేళ్లలోపు వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు ఇప్పటి నుంచే పని చేయాలని సూచించారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకపోవడాన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకున్నదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిలు గౌడ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సమితి సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా తదితరులు హాజరయ్యారు.






