బీజేపీకి షాక్.. కమలం వీడి కారెక్కుతున్న కీలక నేతలు..

by Disha Web Desk 19 |
బీజేపీకి షాక్.. కమలం వీడి కారెక్కుతున్న కీలక నేతలు..
X

దిశ ప్రతినిధి, సిద్దిపేట: సాధారణంగా నాయకులు పార్టీలు మారడం ఎన్నికల వేళ చూస్తుంటాం. దుబ్బాకలో మాత్రం ఎన్నికలకు ఏడాది ముందు నుండే నాయకులు పార్టీలు మారడం కన్పిస్తుంది. సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ ఎన్నికల గేమ్‌ను స్టార్ట్ చేసింది. ప్రతిపక్ష బీజేపీలో కీలక నేతలుగా చెప్పుకునే వారికి గాలమేస్తూ టీఆర్ఎస్‌లోకి లాక్కుంటుంది. టీఆర్ఎస్ ఎత్తుగడలను తిప్పికొట్టేలా బీజేపీ ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయడం లేదు. ఈ విషయంలో కాస్త బీజేపీ నిర్లక్ష్యంతో పాటు విఫలమవుతుందనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.


కారెక్కుతున్న కమలం నేతలు..

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంపై అధికార టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతిపక్ష బీజేపీని బలహీనం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచించుకుంది. ముందుగా బీజేపీలో ముఖ్య నేతలుగా చెప్పుకునే నాయకులకు భారీ ఆఫర్లు ప్రకటిస్తూ టీఆర్ఎస్‌లో చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ ముఖ్య నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ 19వ వార్డు బీజేపీ కౌన్సిలర్ ఎంగారి స్వప్న, దుబ్బాక బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ దొమ్మాట భూపాల్, గల్ఫ్ బాధితుల ఫోరం రాష్ట్ర సభ్యుడు నక్క వెంకటేశ్, జిల్లా ఫోరం అధ్యక్షుడు ఎల్లంలు టీఆర్ఎస్‌లోకి చేరారు. తాజాగా బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు మాడబోయిన యాదగిరి, నాయకులు ఉపేందర్, గుండ్ల పద్మ, విజయలు టీఆర్ఎస్‌లో చేరారు. వీరికి మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. మరికొందరు నేతలు సైతం టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

బీజేపీ విఫలం..

ఓ వైపు టీఆర్ఎస్ అనధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టింది. బీజేపీ ముఖ్య నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. అయినా బీజేపీ నుండి ఎలాంటి స్పందన లేదు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా మొదటి సారి గెలుపొందిన రఘునందన్ రావు కార్యకర్తలను కాపాడుకోవడంలో, క్యాడర్‌ను పెంచుకోవడంలో విఫలమవుతున్నాడనే విమర్శలు బాహటంగానే చర్చించుకుంటున్నారు. ఉన్న కార్యకర్తలను సైతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దుబ్బాక ఎమ్మెల్యే కార్యాకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే రానున్న కాలంలో బీజేపీకి తిరిగి పరాభవం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి వేళ బీజేపీ ఎన్నికల స్ట్రాటజీని అమలు చేస్తుందో లేదో వేచి చూడాలి.


Next Story