- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ నేత హత్య కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి కి యావజ్జీవ శిక్ష
బీజేపీ నేత యోగేష్ గౌడ హత్య కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి యావజ్జీవ శిక్ష! 16 మందికి లైఫ్ టర్మ్, ఇన్స్పెక్టర్ కు 7 ఏళ్ల జైలు శిక్ష.

దిశ, వెబ్ డెస్క్: పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బీజేపీ నాయకుడు యోగేష్ గౌడ హత్య కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణి కి భారీ షాక్ తగిలింది. ఈ హత్య కేసులో ఆయనను దోషిగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం, ఆయనతో పాటు మరో 15 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.
కేసు నేపథ్యం..
ధారవాడ జిల్లా పంచాయతీ సభ్యుడు, బీజేపీ నాయకుడు యోగేష్ గౌడను 2016 జూన్ 15న ధారవాడలోని ఆయన జిమ్‌లోనే గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తొలుత స్థానిక పోలీసులు విచారించినప్పటికీ, బాధితుడి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు కేసు సీబీఐకి బదిలీ అయింది. ఈ కేసును ధర్యాప్తు చేసిన సీబీఐ సుమారు 10,000 పేజీల సమగ్ర ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది. ఇందులో వినయ్ కులకర్ణిని ప్రధాన సూత్రధారిగా పేర్కొంది. రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది.
కోర్టు తీర్పు ముఖ్యాంశాలు
ఈ కేసులో మొత్తం 21 మంది నిందితులలో 17 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ముగ్గురిని (వాసుదేవ్, సోమశేఖర్ తదితరులు) సాక్ష్యాధారాల లేమితో నిర్దోషులుగా విడిచిపెట్టింది. వినయ్ కులకర్ణి సహా 16 మందికి యావజ్జీవ శిక్ష తో పాటు ఒక్కొక్కరికి రూ. 30,000 జరిమానా విధించింది. అలాగే అప్పట్లో ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉండి, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన ఇన్స్పెక్టర్ చిన్నకేశవకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మృతుడు యోగేష్ గౌడ పిల్లలకు రూ. 16 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఎమ్మెల్యే పదవికి దూరం
సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం (లిల్లీ థామస్ కేసు తీర్పు), ఏ ప్రజాప్రతినిధికైనా రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే, వారు తక్షణమే తమ పదవికి అనర్హులవుతారు. వినయ్ కులకర్ణికి యావజ్జీవ శిక్ష పడటంతో ఆయన తన ఎమ్మెల్యే పదవిని కోల్పోనున్నారు. అలాగే, ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే ఇవ్వకుంటే, శిక్షా కాలం పూర్తయ్యాక కూడా మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు.






