- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీకి రూ. 6 వేల కోట్ల విరాళాలు.. మిగతా పార్టీలకు ఎంతంటే?
FY 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాల ప్రకారం.. బీజేపీకి రూ. 6,074.015 కోట్ల విరాళాలు అందినట్టు ADR నివేదిక పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని రాజకీయ పార్టీలకు కార్పొరేట్ శక్తులకున్న అనుబంధాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన తాజా నివేదిక బట్టబయలు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి (FY 2025) సంబంధించి రాజకీయ పార్టీలకు అందిన వివరాల ప్రకారం.. భారతీయ జనతా పార్టీ (BJP)కి ఏకంగా రూ. 6,074.015 కోట్ల విరాళాలు అందాయి. ఇది గత ఏడాది (రూ. 2,243.947 కోట్లు) తో పోలిస్తే 171 శాతం భారీ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. మొత్తం 5,522 విరాళాల ద్వారా ఈ మొత్తం సమకూరింది. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) కూడా తన విరాళాలను 84 శాతం పెంచుకుని 2,501 విరాళాల ద్వారా రూ. 517.394 కోట్లను సేకరించింది.
ఈ నివేదికలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, జాతీయ పార్టీలకు అందిన మొత్తం విరాళాలలో బీజేపీ వాటా ఏకంగా 91 శాతంగా ఉండటం. జాతీయ పార్టీలన్నింటికీ కలిపి వచ్చిన సుమారు రూ. 6,648.563 కోట్ల విరాళాలలో ఒక్క బీజేపీయే సింహభాగం కైవసం చేసుకుంది. మిగిలిన నాలుగు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఆప్, సిపిఐ(ఎం), ఎన్‌పిఈపి)లు కేవలం రూ. 574 కోట్లు మాత్రమే సేకరించగలిగాయి. అంటే, ఇతర పార్టీలన్నింటి కంటే బీజేపీకి సుమారు 10 రెట్లు ఎక్కువ నిధులు అందాయి. ముఖ్యంగా కార్పొరేట్ విరాళాల విషయంలో బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి అందిన రూ. 5,717 కోట్ల కార్పొరేట్ విరాళాలు, ఇతర జాతీయ పార్టీల కార్పొరేట్ విరాళాల మొత్తం కంటే 13 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ రద్దు తర్వాత, ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా నిధులు మళ్లడం, ఎన్నికల సంవత్సరం కావడం వల్ల విరాళాల ప్రవాహం ఈ స్థాయిలో పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం రూ. 20,000 పైబడిన విరాళాలనే పరిగణనలోకి తీసుకుంటేనే పరిస్థితి ఇలా ఉంటే, చిన్న విరాళాలు, సభ్యత్వ రుసుములు మరియు ఇతర ఆదాయ మార్గాలను కలిపితే బీజేపీ మొత్తం ఆదాయం రూ. 6,769 కోట్ల మార్కును దాటినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన కంట్రిబ్యూషన్ రిపోర్టుల ఆధారంగా ADR రూపొందించిన ఈ నివేదిక, భారత రాజకీయాల్లో ధనబలం ఏ స్థాయిలో కేంద్రీకృతమై ఉందో స్పష్టం చేస్తోంది.






