సీఎం రేవంత్​రెడ్డి భాషను అదుపులో పెట్టుకోవాలి : బీజేపీ చీఫ్ ​రాంచందర్​రావు

by Muthe.Rajitha |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తమ భాషను అదుపులో పెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు హెచ్చరించారు.

సీఎం రేవంత్​రెడ్డి భాషను అదుపులో పెట్టుకోవాలి : బీజేపీ చీఫ్ ​రాంచందర్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తమ భాషను అదుపులో పెట్టుకోవాలని, మా నాయకులపై మాట్లాడే ముందు మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకొని, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చర్చకు సిద్ధమైతే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చింది అనే అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తేదీ, సమయం నిర్ణయిస్తే సెక్రటేరియట్ గేట్ వద్ద అయినా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్​విసిరారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మజ్లిస్ సహవాసంతో కాంగ్రెస్ నాయకత్వానికి నిజాం తరహా భాష, ధోరణి అలవాటైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్బంధాలు, బెదిరింపులు, అణచివేత రాజకీయాలకు స్థానం లేదు. రజాకార్లు వ్యవహరించిన విధంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజలు గతంలో నిరంకుశ శక్తులను ఎలా ఎదుర్కొన్నారో, అలాంటి ధోరణులను కూడా అదే విధంగా ఎదుర్కొంటారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో ఉన్న సమయంలో రైతుల భూములను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరమన్నారు.

కోహెడలో 239 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టుకు రైతుల నుంచి భూములను సేకరించి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా సరైన నష్టపరిహారం చెల్లించకుండా బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. నష్టపరిహారం చెల్లించకుండా వారి భూములను స్వాధీనం చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనం. రైతుల భూములు లాక్కొని, రైతులనే అరెస్ట్ చేసి, అదే రైతుల సంక్షేమం గురించి మాట్లాడటం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది. రైతుల నిరసనలను అణచివేసేందుకు అరెస్టులు, నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేయడం పోలీసు పాలనను, నిరంకుశ ధోరణిని తలపిస్తోంది. రైతులను, బీజేపీ నాయకులను నిర్బంధించడం అహంకారపూరిత, అప్రజాస్వామ్య పాలనే అన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టాలి. అప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభించకూడదని డిమాండ్ చేశారు.

పాలమూరులో సీఎం చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలు

మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన సభలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ కుమార్ పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి. పొలిమేర దాటనివ్వను వంటి భాషను ఉపయోగించడం ముఖ్యమంత్రి స్థాయికి తగినది కాదని హెచ్చరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు తమ భాషను అదుపులో పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులపై అసత్య ప్రచారం మానుకోవాలన్నారు. మా నాయకుల గురించి ఇటువంటి వ్యాఖ్యలు కొనసాగితే పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజల్లో తిరగకుండా అడ్డుకునే రాజకీయ సంస్కృతిని తాముసమర్థించం. ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగితే ప్రజలే కాంగ్రెస్ నాయకులను నిలదీసే పరిస్థితి వస్తుందన్నారు. మా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుంది. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, అన్యాయాలు చేస్తూ ప్రజల మధ్య తిరగాలని భావించడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణలు నిర్వహిస్తామన్నారు.

Next Story