అధికార దుర్వినియోగంతో కాంగ్రెస్​ గెలుపు : బీజేపీ చీఫ్​రాంచందర్​రావు

by Muthe.Rajitha |

అర్భన్​ నక్సలైట్లు, మజ్లిస్​ తమను మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాయని బీజేపీ చీఫ్​రాంచందర్​ రావు తెలిపారు.

అధికార దుర్వినియోగంతో కాంగ్రెస్​ గెలుపు : బీజేపీ చీఫ్​రాంచందర్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మజ్లిస్ మద్దతుతోనే చాలాచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం సాధించాయని, అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు, ఎంఐఎం కలిసి బీజేపీ ఓడించే ప్రయత్నం చేశారని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు ఆరోపించారు. తమ పార్టీ గెలుపును అడ్డుకునే లక్ష్యంగా రెండోస్థానంలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ఏది ఉంటే ఆ పార్టీకి ఓటు వేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ముస్లిం ఓటర్లకు పిలుపునిచ్చారని మండిపడ్డారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య “పెవికాల్ బంధం ఉంది. మజ్లిస్ మద్దతు లేకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం సాధించలేవన్నారు. తాము చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని దానికి మజ్లిస్ పార్టీయే కారణమన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటమి తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్​ను మూడు ముక్కలు చేసి మజ్లిస్‌కు ఒక మేయర్ సీటు కట్టబెట్టే ప్రయత్నం చేసిందన్నారు.

ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో హంగ్ వచ్చిన చోట బిజెపి ఎవరికీ మద్దతు ఇవ్వదన్నారు. ఈ ఎన్నికల్లో కూడా బిజెపి ఆశించిన ఫలితాలు రాకపోయిన ప్రాబల్యం పెరిగిందని, దాదాపు 6 మున్సిపాలిటీల్లో మెజార్టీ సీట్లు సాధించిన పెద్దగా పార్టీగా అవతరించిందన్నారు. మొట్టమొదటిసారిగా నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లలో దాదాపు 70 డివిజన్ల వరకు గెలిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ కార్పొరేషన్లలో గతంలో కంటే బిజెపి మెరుగుపడింది. కార్పొరేషన్లు, వార్డు మెంబర్లు కలిపి 320 నుంచి 350 స్థానాల్లో బిజెపి విజయం సాధించే దిశగా ఉంది. ఐదు మున్సిపాలిటీలను బిజెపి కైవసం చేసుకుంటుందని వేములవాడ, రాయికల్, నారాయణపేట్, ఆదిలాబాద్, మెట్‌పల్లిలో చైర్మన్ పదవులను కూడా బిజెపి గెలుచుకుంటోందన్నారు.

గతంలో కేవలం 2 మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించి 241 వార్డు మెంబర్లు గెలిచామని, ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తీసుకువస్తాం, మున్సిపాలిటీలను ఎలా అభివృద్ధి చేస్తామనేది వివరించాం. ఈ ఎన్నికల్లో దాదాపు 350 సీట్లు గెలిచే దిశగా ఫలితాలు కనపడుతున్నాయన్నారు. సుమారు 200 వార్డుల్లో 2 నుంచి 25 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థులు స్వల్పంగా ఓడిపోయారు. త్రిముఖ పోటీ కారణంగా కొన్ని ప్రాంతాల్లో బిజెపి కి కొంత నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రాతినిధ్యం లేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఒక వార్డు, కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఒక డివిజన్‌లో విజయం సాధించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణంగా ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రాలేదు. చాలాచోట్ల హంగ్ పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెస్ చెప్పుకునేంత గొప్ప విజయమేమీ కాదు. సాధించిన విజయాలు కూడా అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యాలతోనే జరిగిందన్నారు. బీజేపీ ఎదుగుతున్న పార్టీ. బీఆర్ఎస్ దిగజారుతున్న పార్టీ. బిజెపి ఓటు షేర్ 13 శాతం నుంచి 20 శాతానికి పెరిగినట్లు కనిపిస్తోంది. ఆదిలాబాద్, ఖానాపూర్, బైంసా ప్రాంతాల్లో చైర్మన్ స్థానాలను గెలుచుకుంటామన్నారు.

Next Story