నక్సల్బరీలో కాషాయ జెండా రెపరెపలు.. లక్ష మెజారిటీతో భారీ విజయం

by Malleboina Mahesh |

నక్సలిజం పుట్టిన గడ్డ నక్సల్బరీలో బీజేపీ అభ్యర్థి ఆనంద్‌మోయ్ బర్మన్ లక్ష ఓట్ల మెజారిటీతో రికార్డు విజయం సాధించారు. హింసాత్మక రాజకీయాలను వీడి ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు.

నక్సల్బరీలో కాషాయ జెండా రెపరెపలు.. లక్ష మెజారిటీతో భారీ విజయం
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల (West Bengal Assembly Elections) ఫలితాల్లో సంచలనాలు నమోదయ్యాయి. అధికార టీఎంసీ (TMC) కి గట్టి షాక్ ఇచ్చిన ఓటర్లు బీజేపీని 200 పైగా సీట్లలో గెలిపించి అధికారం కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో ఏకంగా సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee)తో పాటు అనేక మంది మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. అలాగే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పటి కమ్యూనిస్టుల కంచు కోట, నక్సలిజానికి పునాది పడ్డ నక్సల్బరీ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 1960ల చివరలో చారు మజుందార్ నేతృత్వంలో విప్లవ ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న డార్జిలింగ్ జిల్లాలోని మటిగారా-నక్సల్బరీ నియోజకవర్గం (Matigara-Naxalbari constituency), ఇప్పుడు సంపూర్ణంగా కాషాయమయమైంది.

హింసాత్మక రాజకీయాల నుంచి శాంతియుత అభివృద్ధి వైపు మళ్లాలని కోరుకున్న ఇక్కడి ప్రజలు, బీజేపీకి పట్టం కట్టడం ద్వారా ఒక కొత్త రాజకీయ శకానికి నాంది పలికినట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆనంద్‌మోయ్ బర్మన్ (Anandmoy Burman) లక్షకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో రెండోసారి ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఒకప్పటి భయాలను, ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ ఒత్తిళ్లను పక్కనపెట్టి, నక్సల్బరీ వాసులు అభివృద్ధి, జాతీయవాదం వైపు నిలిచారు. ఈ విజయం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా, మార్పును కోరుకునే ప్రజల సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story