పుచ్చకాయ తిని మృతి చెందిన కుటుంబం కేసులో బిగ్ ట్విస్ట్

by Muthe.Rajitha |

ఇటీవల ముంబైలో ఒక కుటుంబం పుచ్చకాయ తిని మృతి చెందిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

పుచ్చకాయ తిని మృతి చెందిన కుటుంబం కేసులో బిగ్ ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ముంబైలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు పుచ్చకాయ తిని అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏప్రిల్ 25 రాత్రి అబ్దుల్లా డొకాడియా కుటుంబం తమ బంధువులతో కలిసి విందులో పాల్గొన్న తర్వాత, అర్ధరాత్రి సమయంలో పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం అనేక అనుమానాలకు దారి తీసింది. తొలుత ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్ అని అందరూ భావించినప్పటికీ, పోస్ట్‌మార్టం నివేదికలో పలు కీలక నిజాలు వెల్లడయ్యాయి. మృతుల మెదడు, గుండె, ప్రేగులు వంటి కీలక అవయవాలు వింతగా ఆకుపచ్చ రంగులోకి మారాయని వైద్యులు తెలిపారు. సాధారణంగా ఫుడ్ పాయిజన్ అయితే ఇలాంటి మార్పులు సంభవించవని, ఏదైనా అత్యంత శక్తివంతమైన రసాయనం లేదంటే విషపూరిత పదార్థం శరీరంలోకి ప్రవేశిస్తేనే ఇలా జరుగుతుందని డాక్టర్స్ అంటున్నారు.

వాటర్ మెలన్లో కల్తీ లేదు

ఈ కేసులో మరో కీలక పరిణామం ఏమిటంటే, పుచ్చకాయలో ఎలాంటి కల్తీ లేదని ఎఫ్‌డీఏ నివేదికలు స్పష్టం చేశాయి. పుచ్చకాయకు ఇంజెక్షన్లు ఇచ్చారని, అందులో విషపూరిత రసాయనాలు ఉన్నాయని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. అయితే, అబ్దుల్లా శరీరంలో 'మార్ఫిన్' అనే ఓపియాయిడ్ ఆనవాళ్లు కనిపించడం దర్యాప్తులో మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. విందులో పాల్గొన్న ఇతర బంధువులకు ఏమీ కాకపోవడం, కేవలం ఈ నలుగురు మాత్రమే మరణించడం గమనిస్తే, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఫుడ్ పాయిజనింగ్ కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన విష ప్రయోగం కావచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. సోషల్ మీడియాలో బిర్యానీ మరియు పుచ్చకాయ కాంబినేషన్ ప్రమాదకరమని వస్తున్న వార్తలను వైద్యులు కొట్టిపారేశారు.

ఆ మిస్టరీ పదార్థం ఏమిటీ?

ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ మిస్టరీని ఛేదించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నుంచి వచ్చే తుది కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉన్నాయా, ఆర్థిక లావాదేవీల వల్ల ఎవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారా, లేక పుచ్చకాయ కోసిన పాత్రల ద్వారా ఏదైనా విషం లోపలికి వెళ్లిందా అనే కోణాల్లో లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఆ నలుగురు సభ్యుల అవయవాలు ఎందుకు రంగు మారాయి? వారి రక్తంలో కలిసిన ఆ విషపూరిత పదార్థం ఏమిటో తెలిస్తేనే ఈ మిస్టరీ వీడుతుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

Next Story