- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఫిఫా'కు భారీ షాక్!
2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి మరో రెండు వారాలు ఉందనగా నిర్వాహకులకు భారీ షాక్ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్ : 2026 ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) ప్రారంభానికి కేవలం మరో రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉండగా, ఫిఫా టోర్నమెంట్ నిర్వాహకులకు ఊహించని చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ప్రతిష్టాత్మక మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌తో పాటు కీలక మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల అధికార యంత్రాంగం నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్ల ధరలను, ముఖ్యంగా మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్ల రేట్లను సామాన్య అభిమానులకు అందనంత ఎత్తులో, అడ్డగోలుగా పెంచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారిక రీసేల్ మార్కెట్‌లలో కూడా బ్లాక్ దందా తరహాలో విపరీతమైన ధరలకు టికెట్లు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. టికెట్ల లభ్యత, అసలు ధరలు, సీటింగ్ కేటగిరీల విషయంలో నిర్వాహకులు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేశారని న్యూయార్క్, న్యూజెర్సీ వినియోగదారుల రక్షణ విభాగాలు స్పష్టం చేశాయి. హిడెన్ ఫీజులు, అనధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ప్రమోషన్స్ ఇందులో ఉన్నట్లు తేలింది.
ఫిఫా అభిమానుల నుండి వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో, స్థానిక అటార్నీ జనరల్ కార్యాలయాలు రంగంలోకి దిగాయి. క్రీడల పేరుతో దోపిడీ చేయడాన్ని సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు, లాజిస్టిక్స్ పనుల్లో నిమగ్నమై ఉన్న ఫిఫా (FIFA) మరియు స్థానిక నిర్వాహకులకు ఈ లీగల్ నోటీసులు ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ మెగా ఈవెంట్ సజావుగా సాగాలంటే, తక్షణమే టికెటింగ్ విధానంలో మార్పులు చేసి కోర్టుల నుండి క్లియరెన్స్ పొందాల్సిన ఉత్కంఠభరిత పరిస్థితి నెలకొంది.






