FTL, బఫర్ జోన్ బాధితులకు బిగ్ రిలీఫ్.. భారీగా టీడీఆర్ పెంపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-16 17:22:08  IST  )

చెరువులు, నదులు, నాలాల పరిరక్షణతో పాటు, ఆయా పరిధిలోని భూ యజమానులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

FTL, బఫర్ జోన్ బాధితులకు బిగ్ రిలీఫ్.. భారీగా టీడీఆర్ పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువులు, నదులు, నాలాల పరిరక్షణతో పాటు, ఆయా పరిధిలోని భూ యజమానులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోపాలిటన్ ఏరియా మరియు పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏ అండ్ యూడీ) జి.ఓ.ఎం.ఎస్. నెం.16 ద్వారా భవన నిర్మాణ నిబంధనలు–2012లో సవరణలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జలాశయాల ఆక్రమణల తొలగింపు, సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో.. నిర్మాణాలకు అనుమతి లేని ఎఫ్టీఎల్, ఎంఎఫ్ఎల్, బఫర్ జోన్లలోని భూములకు బదులుగా ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీ చేసే విధానంలో భారీ మార్పులు చేసింది. పర్యావరణ పరిరక్షణ, భూ యజమానుల ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేవలం ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థలు (హైడ్రా, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ తదితర) నోటిఫై చేసిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ సవరణలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గతంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సమానంగా టీడీఆర్ ఉండేది. తాజా సవరణలో దీనిని హేతుబద్ధీకరించి, భూమిని స్వచ్ఛందంగా అప్పగించే వారికి ప్రోత్సాహకాలు పెంచారు. అభివృద్ధి అనుమతులు ఇవ్వలేని ఎఫ్టీఎల్, ఎంఎఫ్ఎల్ బఫర్ జోన్ల భూముల విషయంలో భూ యజమానులకు ప్రత్యామ్నాయంగా టీడీఆర్ ఇవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సమతుల్యత సాధించాలన్నదే లక్ష్యంగా వెల్లడించింది. టీడీఆర్‌కు మార్కెట్‌లో డిమాండ్ పెంచే ఉద్దేశంతో, 10 అంతస్తులకు మించిన హైరరైజ్ భవనాల్లో 10వ అంతస్తు పైగా ఉన్న నిర్మిత విస్తీర్ణంలో 10 శాతం టీడీఆర్ వినియోగం తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ణయించింది.

టీడీఆర్ మంజూరు కోసం నిబంధనలివే..

- చెరువుల ఎఫ్టీఎల్, నదుల ఎంఎఫ్ఎల్ పరిధిలో ఉన్న భూములకు- వదులుకున్న నిర్మిత విస్తీర్ణానికి 200 శాతం టీడీఆర్.

- చెరువులు, నదుల బఫర్ జోన్లలో ఉన్న భూములకు- 300 శాతం టీడీఆర్.

- జలవనరుల అభివృద్ధి లేదా రహదారి విస్తరణ వంటి ప్రజాప్రయోజనాల కోసం అవసరమైన భూములకు- 400 శాతం టీడీఆర్.

- ప్రైవేటు భూముల్లో నాలా విస్తరణ జరిగితే, రోడ్డు విస్తరణతో సమానంగా 400 శాతం టీడీఆర్ వర్తింపు.

- భూమి యజమానులు భూమిని ఉచితంగా ప్రభుత్వానికి అప్పగిస్తే, మిగిలిన భూమిలో సెట్‌బ్యాక్‌ల సడలింపు, అదనపు అంతస్తులు లేదా అదనపు నిర్మాణ విస్తీర్ణం పొందే వెసులుబాటు కూడా కల్పించారు. అయితే ఇవన్నీ ఫైర్, ఎయిర్‌పోర్ట్ తదితర సంబంధిత అనుమతులకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు.

అధికారుల క్లియరెన్స్ మస్ట్..

నీటి వనరులకు సంబంధించిన భూములకు టీడీఆర్ జారీ చేయడానికి ముందు.. ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రెవెన్యూ శాఖ అడిషనల్ కలెక్టర్ ర్యాంకు తగ్గని అధికారుల నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి. భూమి టైటిల్, ఎఫ్టీఎల్ పరిధిపై స్పష్టత వచ్చాకే టీడీఆర్ మంజూరు చేస్తారు. ఒకవేళ భూ యజమాని అందుబాటులో లేకపోయినా, భూమిపై టైటిల్ వివాదాలు ఉన్నా.. ఆ భూమికి సంబంధించిన టీడీఆర్‌ను 'టీడీఆర్ బ్యాంక్'లో జమ చేస్తారు. వివాదం పరిష్కారమయ్యాక లేదా యజమాని సరైన పత్రాలతో వచ్చినప్పుడు దానిని జారీ చేస్తారు. ఒక ఎకరం కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న బల్క్ ల్యాండ్స్ విషయంలో టీడీఆర్ ఇవ్వాలంటే ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మార్కెట్‌లో టీడీఆర్‌కు డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం కీలక నిబంధన పెట్టింది. 10 అంతస్తులకు మించి నిర్మించే ఆకాశహర్మ్యాల్లో (హై రైజ్ బిల్డింగ్స్).. 10వ అంతస్తు పైన నిర్మించే విస్తీర్ణంలో 10 శాతానికి సరిపడా టీడీఆర్‌ను కచ్చితంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ సవరణలు తక్షణం అమల్లోకి వస్తాయని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story