ఎమ్మెల్యే పోచారం, కాలే యాదయ్యల భవితవ్యం తేలేది నేడే.. ఉత్కంఠ రేపుతున్న స్పీకర్ నిర్ణయం

by Malleboina Mahesh |

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై ఈ రోజు(15-01-2026)న కీలక పరిణామం చోటుచేసుకోనుంది.

ఎమ్మెల్యే పోచారం, కాలే యాదయ్యల భవితవ్యం తేలేది నేడే.. ఉత్కంఠ రేపుతున్న స్పీకర్ నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై ఈ రోజు(15-01-2026)న కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే గత నెలలో ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేస్తూ, వారు పార్టీ మారినట్లు తగిన ఆధారాలు లేవని క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో, మిగిలిన ఎమ్మెల్యేల భవితవ్యంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ ఫిరాయింపుల వ్యవహారం గత ఏడాది కాలంగా న్యాయస్థానాల్లో, స్పీకర్ కార్యాలయంలో సుదీర్ఘంగా సాగుతోంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ వరుసగా విచారణలు చేపట్టి, ఎమ్మెల్యేల వాదనలను విన్నారు.

ప్రస్తుతం నిర్ణయం వెలువడనున్న ఎమ్మెల్యేలతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి కీలక నేతల అంశం కూడా పెండింగ్‌లో ఉంది. వీరిపై దాఖలైన పిటిషన్లపై మరిన్ని వివరణలు కోరినట్లు తెలుస్తోంది. స్పీకర్ నేడు వెలువరించే తీర్పు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే, బీఆర్ఎస్ మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

Next Story