పాదయాత్ర సమయంలో రాసుకున్నవన్నీ గుర్తున్నాయి: భట్టి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రామగుండం బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.

పాదయాత్ర సమయంలో రాసుకున్నవన్నీ గుర్తున్నాయి: భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రామగుండం బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం పేదల ఆత్మగౌరవం, సంక్షేమం, ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ అభివృద్ధిపై దృష్టి సారించి ముందుకు సాగుతోందని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రజల అవసరాలు తీరలేదని చెప్పారు. దొరల మనస్తత్వంతో పరిపాలన జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల చేతే పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని 5.14 లక్షల రెగ్యులర్ ఉద్యోగులకు(సింగరేణి, విద్యుత్ రంగాలతో సహా)కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నాం. ఇది కార్మికుల కుటుంబాల భద్రతతో పాటు, ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని అన్నారు.

దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ

ఇండ్లు లేని నిరుపేదలకు ఆత్మగౌరవంతో జీవించేలా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇండ్లు, మొత్తం రూ.22,500 కోట్లతో అమలు చేస్తున్నాం. స్థలాలు లేని వారికి స్థలాలు కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పి, 96 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ఏకధాటిగా పంపిణీ చేస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 53 లక్షల గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం, పేదలు, మధ్య తరగతి కుటుంబాల తరపున మరియు 29 లక్షల వ్యవసాయ పంపుసెట్ల బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇప్పటికే రూ.8,600 కోట్లు ఆర్టీసీకి చెల్లించినట్లు గుర్తుచేశారు.

కాపాడాల్సిన బాధ్యత మనందరిది

పాదయాత్రలో ప్రజలు కోరిన 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. ఉద్యోగాలు, ఆర్థిక అభివృద్ధికి కీలకమని చెప్పారు. సింగరేణి, ఎన్‌టీపీసీ, రామగుండం ఫర్టిలైజర్స్ వంటి ప్రాజెక్టులు గత కాంగ్రెస్ హయాంలోనే తీసుకొచ్చినవి – గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్కటి కూడా తీసుకురాలేదని అన్నారు. సింగరేణి కాలరీస్ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఈ సంస్థలో 42 వేల రెగ్యులర్ + 40 వేల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఉద్యోగులతో పాటు సింగరేణిని కాపాడుకోవడం మన బాధ్యత. సింగరేణి భవిష్యత్తులో రేర్ ఎర్త్ మినరల్స్, మైనింగ్‌లో ముందుండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ భావజాలం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచ దేశాలతో పోటీపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. పాదయాత్రలో నోట్ చేసుకున్న ప్రజల అవసరాలను ఒక్కొక్కటిగా తీరుస్తున్నాం. రామగుండం ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చేపడుతున్నాం. కేంద్ర ప్రీ-బడ్జెట్ సమావేశాల నుంచి తిరిగి వచ్చి కూడా ప్రజల కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. పేదల సంక్షేమమే కాంగ్రెస్ భావజాలం. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం – ప్రజల కోసం – ప్రజల చేతే అనే నినాదంతో రాష్ట్ర అభివృద్ధి ప్రయాణం కొనసాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Next Story