నేను కూడా కుల వివక్షతను ఎదుర్కొన్నా : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Muthe.Rajitha |

రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశంలోని కుల రుగ్మతలకు పరిష్కారం చూపగలరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

నేను కూడా కుల వివక్షతను ఎదుర్కొన్నా : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయితేనే దేశంలో రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధానమంత్రిగా చేసే వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలి.. రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వికారాబాద్ లో నిర్వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో "కుల సమస్యలు, రిజర్వేషన్లు, కాంగ్రెస్ వాదిగా కుల వివక్ష నిర్మూలనకు ఎలా పోరాటం చేయాలి" అనే అంశంపై సోమవారం నాడు జరిగిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క ప్రసంగించారు. దేశంలో అంటరానితనం, వివక్ష సమస్య ఎక్కడ ఎదురైనా రాహుల్ గాంధీ అక్కడ ప్రత్యక్షం అవుతారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కుల వివక్షను భరించలేక ఆత్మహత్యకి పాల్పడితే రాహుల్ గాంధీ నేరుగా ఆ యూనివర్సిటీకి చేరుకొని విద్యార్థులతో చర్చించి పోరాట విధానాన్ని ఖరారు చేశారన్నారు.

రాహుల్ ఆలోచన మేరకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రోహిత్ వేముల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో అనేక విప్లవాత్మక చట్టాలు చేసిన కాంగ్రెస్ ని కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, బీజేపీ తమ పార్టీని దేశంలో లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ముక్తభారత్ చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం అంటోందని ఆయన మండిపడ్డారు. కులం అనేది దేశంలో ఒక వాస్తవం, తాను కుల వివక్షతను ఎదుర్కొన్నానని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో అంటరానితనం పూర్తిగా నిర్మూలించాలని, దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించాలని టీకే మాధవన్ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేరళలో వైకాం సత్యాగ్రహ, మహారాష్ట్రలో అంబేద్కర్ ఆధ్వర్యంలో చౌదర్ సత్యాగ్రహం వంటి కార్యక్రమాలను అఖిలభారత కాంగ్రెస్ కమిటీ చేపట్టిందని భట్టి విక్రమార్క తెలిపారు.

స్వాతంత్ర అనంతరం ప్రధాని నెహ్రూ, అంబేద్కర్ ఆధ్వర్యంలో దేశంలో అంటరాని తనం నిర్మూలనకు 1049లో ఆర్టికల్ 17 ద్వారా అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను పూర్తిగా అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారానే సాధ్యమైందని, భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయ కరణ ద్వారా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం లభించిందని, సామాజిక వివక్షను ఎదుర్కొనేందుకు చేయూత లభించిందని డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశంలో టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్, వంశీ చందర్ రెడ్డి, ఏఐసీసీ నేతలు విశ్వనాథన్ సావంత్, సచిన్ రావు తదితరులు పాల్గొన్నారు.

శిక్షణా శిబిరంలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహరచనలపై శిక్షణలు....

నూతన డీసీసీ చీఫ్​లకు పది రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణా శిబిరం మూడో రోజుకు చేరుకున్నది. ఈ శిక్షణా శిబిరంలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహరచన, సోషల్ మీడియా అండ్ మీడియా నిర్వహణ, కార్యాచరణ ప్రణాళికలు వంటి కీలక అంశాలపై నిపుణుల ద్వారా సవివరంగా శిక్షణ అందిస్తున్నారు. జిల్లాల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ సిద్ధాంతాలను తీసుకెళ్లడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు వెల్లడించారు.

Next Story