ఆపదలో ఉన్నారా.. దిగులొద్దు..! : పోలీసుల "భరోసా"

by Muthe.Rajitha |

మహిళలపై భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది.

ఆపదలో ఉన్నారా.. దిగులొద్దు..! : పోలీసుల భరోసా
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలపై భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. బస్టాండ్లు, కాలేజీలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ సరికొత్త అస్త్రాలను సిద్ధం చేసింది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మహిళల రక్షణ కోసం అత్యాధునిక వ్యవస్థలను తీసుకొచ్చింది. మఫ్టీలో తిరుగుతూ పోకిరీల భరతం పడుతున్న షీ టీమ్స్ సేవలను మరింత విస్తృతం చేసింది. రహస్య కెమెరాలను పసిగట్టే టెక్నాలజీ నుంచి.. ఆపదలో ఉంటే నిమిషాల్లో వాలిపోయే కమాండ్ సిస్టమ్ వరకు పక్కా ప్రణాళికతో మహిళలకు కొండంత అండగా నిలుస్తోంది.

'స్పందన'

నేరాల తీరు మారుతున్న నేపథ్యంలో మహిళల ప్రైవసీని కాపాడేందుకు పోలీసులు హైదరాబాద్‌లో షీ నేత్ర పేరుతో ఏడు ప్రత్యేక బృందాలు షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్, హోటళ్లు, విద్యాసంస్థల హాస్టళ్లలో ఎవరైనా సీక్రెట్ కెమెరాలు పెట్టారా..? అని ఈ బృందాలు అధునాతన పరికరాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పోకిరీల గుట్టురట్టు చేస్తున్నాయి. అలాగే, మహిళలకు అత్యవసర సమయాల్లో తక్షణ రక్షణ కల్పించేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘స్పందన’ పేరుతో ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. డయల్ 100, 112 కంట్రోల్ రూమ్‌లకు నేరుగా అనుసంధానమైన ఈ వ్యవస్థ ద్వారా.. కాల్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు రక్షణ కల్పిస్తున్నారు.

‘స్టాండ్ విత్ హర్’

మహిళల భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, అందులో పురుషుల భాగస్వామ్యం కూడా అత్యవసరమన్న ఉద్దేశంతో మార్చిలో ‘స్టాండ్ విత్ హర్’ అనే వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వేధింపులను చూస్తూ ఊరుకోకుండా మగవారు సైతం వాటిని అడ్డుకునేలా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు మహిళలకు రక్షణతో పాటు ఆర్థిక సాధికారత కల్పించే ఉద్దేశంతో ఫిబ్రవరిలో ఉమెన్ లెడ్ మొబిలిటీ లైవ్‌లీహుడ్స్ కింద బిజిలీరైడ్ పైలెట్ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే మహిళా డ్రైవర్లను ప్రోత్సహిస్తూ వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.

'నిర్భయ అస్త్రం'

నిఘాతో పాటు ఆన్‌లైన్ వేధింపులు, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపైనా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 2025-26 సంవత్సరాల్లోనే వాట్సాప్ ఫిర్యాదులు, డిజిటల్ నిఘా ద్వారా వేలాది మంది ఈవ్‌ టీజర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొదటిసారి దొరికిన వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. కానీ, పదేపదే వేధింపులకు పాల్పడే వారిపై మాత్రం ఏమాత్రం ఉపేక్షించకుండా నిర్భయ చట్టం కింద కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేసి నేరుగా జైలుకు పంపుతున్నారు.

ఆపదలో ఉంటే ఫోన్ చేయండి

ఎక్కడైనా, ఏ చిన్న వేధింపు ఎదురైనా మహిళలు, యువతులు భయపడకుండా, లోలోపల కుమిలిపోకుండా వెంటనే మమ్మల్ని ఆశ్రయించాలి. ఫిర్యాదుదారుల వివరాలను వందశాతం గోప్యంగా ఉంచుతాము. ఆపదలో ఉన్నప్పుడు సాయం కోసం డయల్ 100 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలి. వేధింపులకు సంబంధించిన ఆధారాలు, ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు షీ టీమ్స్ వాట్సాప్ నంబర్లు 8712656858, 8712656856 లకు లేదా హెల్ప్‌లైన్ నంబర్ 9490616555 కు సమాచారం ఇవ్వండి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కటకటాల వెనక్కి వెళ్లకతప్పదు..

- చారుసిన్హా, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా

Next Story