- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ యాత్రలు..
తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ రెండు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను ప్రకటించింది.

దిశ, సికింద్రాబాద్ : తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ రెండు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను ప్రకటించింది. అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, బైద్యనాథ్ ధామ్, దివ్య దక్షిణ యాత్ర, అరుణాచలం మీదుగా ప్రత్యేక యాత్రలను నిర్వహించనుంది. అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర రైలు జూలై 4న మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరనుంది. ఈ యాత్రలో విష్ణుపద ఆలయం, కాశీ విశ్వనాథ్ ఆలయం, కాశీ విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణ దేవి ఆలయం, గంగా హారతి, రామ జన్మభూమి, హనుమాన్ గఢి, త్రివేణి సంగమం, బైద్యనాథ్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. ఈ యాత్ర 9 రాత్రులు–10 రోజుల పాటు కొనసాగుతుంది.
ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ఎక్కే, దిగే సౌకర్యం కల్పించారు. అలాగే, దివ్య దక్షిణ యాత్ర–అరుణాచలం ప్రత్యేక రైలు జూలై 20న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనుంది. ఈ యాత్రలో అరుణాచలేశ్వర ఆలయం, నటరాజ ఆలయం, శ్రీరంగనాథస్వామి ఆలయం, బృహదీశ్వర ఆలయం, రామనాథస్వామి ఆలయం, మీనాక్షి అమ్మవారి ఆలయం, వివేకానంద రాక్ మెమోరియల్, కన్యాకుమారి అమ్మవారి ఆలయం దర్శించే అవకాశం ఉంటుంది. ఈ యాత్ర 8 రాత్రులు–9 రోజుల పాటు సాగుతుంది. ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఎక్కే, దిగే సౌకర్యం కల్పించారు. ఈ ప్యాకేజీలో ప్రయాణం, శాకాహార భోజనాలు, ప్రయాణ బీమా, భద్రత, టూర్ ఎస్కార్ట్‌లు, ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్ల సేవలు కూడా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.






