- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలు: టీజీఎస్ఆర్టీసీ
భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేసేందుకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మార్చి 27న జరిగే వేడుకలకు వెళ్లలేని భక్తులు రూ.151 చెల్లించి ఆన్‌లైన్ లేదా లాజిస్టిక్స్ కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు.

దిశ, తెలంగాణ బ్యూరో: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 27, 2026 న జరిగే వేడుకలను దృష్టిలో ఉంచుకుని, వివిధ కారణాల వల్ల భద్రాచలం కు వెళ్లలేని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాముల వారి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.
ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాల ప్యాకెట్లు' పొందాలనుకునే భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్ సైట్‌లో లాగిన్ అయి ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి... వివరాలను నమోదు చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ బస్ భవన్ లో శనివారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ ను ఎండీ ఆవిష్కరించారు.
నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారని... విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని మూడేళ్ళ క్రితమే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని... ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందని ఎండీ తెలిపారు. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారని... 2022 లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గత మూడేళ్లలో లక్షలాది మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసిందని అన్నారు.
భద్రాద్రిలో మార్చి 27న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని నాగిరెడ్డి తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440069లలో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ సీటీఎం(మార్కెటింగ్ & కమర్షియల్) శ్రీధర్, లాజిస్టిక్ ఏటిఏం రాజన్, భాను తదితరులు పాల్గొన్నారు.
- Tags
- TGSRTC






