నమ్మిన వ్యక్తే మోసం చేశాడు.. నకిలీ డీఏపీతో కలెక్టరేట్‌కు ఎద్దుల బండిపై రైతు ప్రయాణం

by Ratna Kumari |

నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన రైతు వాడాల భీంరెడ్డి తాను నమ్మిన వ్యక్తే నకిలీ డీఏపీ ఎరువులు విక్రయించి మోసం చేశాడని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరాడు.

నమ్మిన వ్యక్తే మోసం చేశాడు.. నకిలీ డీఏపీతో కలెక్టరేట్‌కు ఎద్దుల బండిపై రైతు ప్రయాణం
X

దిశ, బిజినేపల్లి : నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన రైతు వాడాల భీంరెడ్డి తాను నమ్మిన వ్యక్తే నకిలీ డీఏపీ ఎరువులు విక్రయించి మోసం చేశాడని ఆరోపిస్తూ, నకిలీ డీఏపీ సంచులను ఎద్దుల బండిపై తీసుకుని నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరాడు. రైతు తెలిపిన వివరాల ప్రకారం, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు నకిలీ డీఏపీ విక్రయించాడని, దీనివల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. దీంతో జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు నకిలీ డీఏపీ సంచులతోనే ఎద్దుల బండిపై ప్రయాణం ప్రారంభించారు.

పాలెం గ్రామం వద్ద రైతుకు సంఘీభావంగా సీపీఐ జిల్లా నాయకులు ఈర్ల చంద్రమౌళి, కృష్ణాజీలు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నకిలీ డీఏపీతో నష్టపోయిన ప్రతి రైతుకు, నకిలీ ఎరువులు విక్రయించిన వ్యాపారుల నుంచే నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న నిందితులు బాధిత రైతు ఎద్దుల బండిని అడ్డగించేందుకు ప్రయత్నించగా, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించి, నకిలీ డీఏపీ సంచులను స్వాధీనం చేసుకున్నారు. రైతులు తమ సొంత భూములతో పాటు కౌలు భూములు సాగు చేస్తూ లక్షల రూపాయలు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారని, అలాంటి రైతులను కొందరు ఫర్టిలైజర్ వ్యాపారులు నకిలీ ఎరువులు విక్రయించి మోసం చేయడం అత్యంత దురదృష్టకరమని సీపీఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఎరువుల విక్రయాలను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Next Story