- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్‌లో ఘనంగా బీరన్న బోనాల పండుగ
హుజూరాబాద్ పట్టణంలో గొల్ల, కురుమ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ బీరన్నస్వామి బోనాల పండుగ ఆధ్యాత్మిక ఉత్సాహం, భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ పట్టణంలో గొల్ల, కురుమ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ బీరన్నస్వామి బోనాల పండుగ ఆధ్యాత్మిక ఉత్సాహం, భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ వేడుకల్లో గొల్ల, కురుమలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని సిరసపల్లి రోడ్డులో వెలసిన శ్రీ బీరన్నస్వామి ఆలయానికి మహిళలు నెత్తిన బోనాలు మోసుకుంటూ మంగళహారతులు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం ఆలయంలో బోనాలు సమర్పించి తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు.
భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన చైర్‌పర్సన్..
ఈ వేడుకల్లో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ బీరన్నస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాదవ, కురుమ సోదరుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరన్నస్వామి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, పట్టణం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గొల్ల, కురుమల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ ఐక్యంగా జరుపుకోవడం అభినందనీయమని పేర్కొంటూ భక్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మేకల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్‌కుమార్, గొల్ల-కురుమ సంఘాల ప్రతినిధులు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.






