చదువుకునే వయసులో కవులుగా మారడం గర్వించదగ్గ విషయం

by Ratna Kumari |

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుకునే వయసులోనే కవితలు రాయడం గర్వించదగ్గ విషయమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.

చదువుకునే వయసులో కవులుగా మారడం గర్వించదగ్గ విషయం
X

దిశ, కొల్చారం : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుకునే వయసులోనే కవితలు రాయడం గర్వించదగ్గ విషయమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. సోమవారం రంగంపేట ఉన్నత పాఠశాలలో ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించిన 49 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి రచించిన మూడు పుస్తకాలను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా విద్యాధికారి రాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకునే వయసులోనే కవితలు రాసేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం పాఠశాల ఉపాధ్యాయుడు నరేష్ చారి వ్యక్తిత్వానికి నిదర్శనమని కొనియాడారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే, జిల్లా విద్యాధికారి అభినందించారు. పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడం ఉపాధ్యాయుల పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యావంతులైన, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని, వారు ఇష్టపడి పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని, అందుకు రంగంపేట ఉన్నత పాఠశాల నిదర్శనంగా నిలుస్తోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుత ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట సహకార సంఘం అధ్యక్షుడు అరిగే రమేష్, సర్పంచ్ స్వర్ణలత విజయ్, ఉపసర్పంచ్ సురేష్, మాజీ సీడీసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, ముత్యం గారి మేఘమాల సంతోష్, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, యువజన విభాగం అధ్యక్షుడు సంతోష్ రావు, సర్పంచులు ఆంజనేయులు, కాంతమ్మ ప్రభాకర్, నాయకులు రాజాగౌడ్, పోచయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Next Story