- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐ కంటే ఉద్యోగులే బెటర్..దిగ్గజ కార్ల కంపెనీ యూటర్న్
ఏఐ మాయలో పడిపోయిన ప్రపంచం ఇప్పుడు ఏ రంగంలో చూసినా కృత్రిమ మేధపైనే ఫోకస్ పెట్టాయి. అయితే తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ మాత్రం ఏఐ దెబ్బకు తిరిగి ఉద్యోగులను వెనక్కి రప్పిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలో ఇప్పుడు ఏ రంగాన్ని తట్టినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కుదిపేస్తోంది. అది ఇది అనే తేడా లేకుండా అన్ని విభాగాల్లో వస్తున్న ఏఐ మార్పు ఉద్యోగుల భవిష్యత్‍కు సవాలుగా మారింది. ఏఐ రాకతో ఇప్పుటికే అనేక మంది తమ ఉద్యోగాలు కోల్పోగా రాబోయే రోజుల్లో మరెంతో మందికి లేఆప్స్ తప్పవనే భయందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రముఖ కార్ల కంపెనీ ఏఐ దెబ్బకు చేతులు కాల్చుకోవడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ఏఐ రాకతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగిస్తుంటే ఆ సంస్థ మాత్రం ఏఐతో చేతులు కాల్చుకుని ఇప్పుడు పాత ఇంజనీర్లను మళ్లీ వెనక్కి పిలిపించుకోవడం ఆసక్తిగా మారింది.
దెబ్బకు యూటర్న్:
ఏఐ మెరుపులు, మురిపానికి ముచ్చటపడుతున్న అనేక సంస్థలు ఎన్నో ఏళ్లుగా తమ సంస్థలకు నమ్మకంగా పని చేస్తున్న ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ఈ దెబ్బతో చేసేదేమి లేక తలలు బాదుకుంటూ జరుగుతున్న తతంగాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. అయితే తమ వరకు వస్తేగానీ తత్వం బోధపడదన్నట్లు ఏఐ మోజులోపడిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ తాజాగా గుణపాఠం నేర్చుకుంది. వాహనాల నాణ్యత పరీక్షల కోసం గతంలో ఫోర్డు ఏఐ వైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఏఐ, ఆటోమేటెడ్ క్వాలిటీ సిస్టమ్స్ పై ఆధారపడటం మొదలు పెట్టింది. అయితే దశాబ్దాల తరబడి మానవ ఇంజనీర్లకు ఉండే అనుభవం, చాకచక్యం ముందు ఏఐ టెక్నాలజీ సరిపోదని ఫోర్డ్ గ్రహించడానికి ఎక్కువ సమయమేమి పట్టలేదు. ఆటోమేటెడ్ క్వాలిటీ సిస్టమ్స్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా చేదుఅనుభవాన్ని మిగిల్చింది. ఈ ఎఫెక్ట్ తో కంపెనీ తాజాగా యూ టర్న్ తీసుకుంది. తమ తప్పును సరిదిద్దుకుంటూ వందలాది మంది సీనియర్, రిటైర్డ్ ఇంజనీర్లను కంపెనీ మళ్లీ విధుల్లోకి చేర్చుకుంటోంది. ఈ విషయంలో ఫోర్డ్ కంపెనీ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ పూన్ స్పందిస్తూ.. కేవలం ఏఐ సిస్టమ్స్‌లోకి డిజైన్ అవసరాలను ఫీడ్ చేస్తే సరిపోతుందని, అది నాణ్యమైన ఉత్పత్తిని ఇస్తుందని తాము తప్పుగా అంచనా వేసినట్లు అంగీకరించారు. ఈ క్రమంలో గత మూడేళ్లల్లో ఫోర్డ్ 350 మంది అనుభవజ్ఞులైన ఇంజనీర్లను క్వాలిటీ కంట్రోల్ చెక్స్ కోసం తిరిగి నియమించుకుందని వీరిలో కొందరు మాజీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
అనుభవం ముఖ్యం:
ఏఐ స్థానంలో తిరిగి మానవ మేధస్సుకు వారి అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వంతో నెలల వ్యవధిలోనే కంపెనీ ర్యాంకు మెరుగుపడి లాభాలు మొదలయ్యాయి. అయితే తమకు ఎదురైన ఈ అనుభవం రీత్యా ఫోర్డ్ కంపెనీ తిరిగి మానవ మేధస్సుకు ప్రయార్టీ ఇస్తున్నప్పటికీ ఏఐ టెక్నాలజీని పూర్తిగా పక్కన పెట్టడం లేదని స్పష్టం చేసింది. సంస్థలోకి చేర్చుకుంటున్న అనుభవం కలిగిన సీనియర్ ఇంజినీర్ల ద్వారా యువ సిబ్బందితో పాటు ఏఐకి శిక్షణ ఇప్పిస్తున్నట్లు పేర్కొంది. వారి అనుభవంతో ఏఐని మరింత మెరుగైనదిగా ఉపయోగించుకునేలా ఫోర్డ్ ప్రణాళికలు చేస్తున్నది. ఇదిలా ఉంటే కృత్రిమ మేధ ఖర్చు భారంగా మారడంతో ఇప్పటికే పలు కంపెనీలు ఏఐ బడ్జెట్‍పై పునరాలచనల్లో పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఏఐ వద్దని ఉద్యోగులే మేలు అనేలా సంస్థల ఆలోచనలు మారుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ ఫోర్డ్ అనుభవం ఎలాంటి మలుపుకు శ్రీకారం చుట్టబోతోంది అనేది కాలమే సమాధానం చెప్పనుంది.






