వరంగల్ సీపీగా శ్వేత...

by Kodari Anjali |   (  Updated:2026-06-29 14:59:09  IST  )

వరంగల్ నూతన పోలీస్ కమీషనర్‌గా ఎన్.శ్వేతను ప్రభుత్వం నియమించింది.

వరంగల్ సీపీగా శ్వేత...
X

దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ నూతన పోలీస్ కమీషనర్‌గా ఎన్.శ్వేతను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఐపీఎస్ లను బదిలీ చేసింది. బదిలీ అయిన వారు వెంటనే విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్టాణావు ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటి వరకు పోలీస్ కమీషనర్‌గా పనిచేస్తున్న సన్ ప్రీత్ సింగ్‌ను సైబరాబాద్ జాయింట్ కమీషనర్ ట్రాఫిక్‌గా బదిలీ చేశారు. రాజన్న జోన్ డీఐజీగా అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. వరంగల్ పోలీస్ కమీషనర్‌గా పనిచేసిన సన్ ప్రీత్ సింగ్ పలు కీలక మార్పులను ప్రవేశపెట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై, సీఐలను సస్పెండ్ చేయడంతో పాటు కీలకమైన అధికారులకు పోస్టింగ్ లను ఇచ్చారు. మట్టి దందాల్లో ఉన్న అధికారులపైన చర్యలు తీసుకున్నారు. పలు కీలక మార్పులను పోలీస్ కమీషనరేట్ పరిధిలో చేపట్టారు. వరంగల్ పోలీస్ కమీషనర్ గా నియమితులైన ఎన్.శ్వేత హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ కమీషనర్ గా పనిచేస్తున్నారు.

ప్రస్తుతం బదిలీ అయిన సన్ ప్రీత్ సింగ్...

గతంలో సిద్దిపేట కమిషనర్‌గా, కామారెడ్డి జిల్లా ఎస్పీగా ఆమె పని చేశారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరున్న ఆమెను వరంగల్ సీపీగా నియమించారు. రాజకీయ కార్యకలాపాలు ఉదృతంగా ఉండే వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మహిళా అధికారికి కీలకమైన పోస్టును కట్టబెట్టారు. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న పోలీస్ కమీషనరేట్ పరిధిలో కీలక నేతలు ఉన్నారు. ప్రస్తుతం బదిలీ అయిన సన్ ప్రీత్ సింగ్ కొంత మంది నేతలకు వినకపోవడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకోవడం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకపోవడం వల్ల బదిలీ జరిగినట్లు తెలుస్తుంది. గత కొన్నినెలలుగా ఒకరిద్దరు నేతలు బాహటంగానే బదిలీ చేయిస్తామని హెచ్చరించడం దానికి ఆయన సరేనని చెప్పడం తన పని తాను చేసుకుపోవడం బదిలీలలో రాజకీయ జోక్యం తగ్గించడం వల్ల కూడా ఈ బదిలీ జరిగినట్లు తెలుస్తుంది. హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లుగా ఇద్దరు మహిళా ఐఏఎస్ లు పనిచేస్తుండగా కమీషనర్ గా మహిళా ఐపీఎస్ అధికారిని నియమించడం వల్ల పని సజావుగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. రాజకీయ నేతల సూచనల మేరకే ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తుంది.

Next Story