భార్య, అత్తింటి వేధింపులకు వ్యాపారి ఆత్మహత్య! చనిపోయే ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్

by Ramesh Naini |

భార్య, అత్తింటి వారి మానసిక వేధింపులు తాళలేక 28 ఏళ్ల యువ వ్యాపారి తన దుకాణంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య, అత్తింటి వేధింపులకు వ్యాపారి ఆత్మహత్య! చనిపోయే ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భార్య, అత్తింటి వారి మానసిక వేధింపులు తాళలేక 28 ఏళ్ల యువ వ్యాపారి తన దుకాణంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఫరీదాబాద్‌కు చెందిన రాహుల్ (28) రెండేళ్ల క్రితం జ్యోతి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత భార్య బలవంతం మేరకు తల్లిదండ్రులకు దూరంగా వేరు కాపురం ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితమే ఓ బట్టల దుకాణం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన తల్లిని కలిసి వెళ్లిన గంటలోపే రాహుల్ తన షాప్‌లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

వీడియోలో సంచలన ఆరోపణలు..

ఆత్మహత్యకు ముందు రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో తన భార్య జ్యోతి, అత్త వీణ, మామ బిట్టు, మరదలు నీతు తనను తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. ‘ఇల్లు ఊడ్చడం, అంట్లు తోమడంతో సహా ఇంటి పనులన్నీ నా చేతే చేయించారు. అయినా సరే నన్ను కొట్టారు.. నాపై అబద్ధపు కేసులు పెట్టారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నా చావుకు వారే కారణం, చట్టప్రకారం వారికి శిక్ష పడాలి. నా ఆస్తి నా తల్లికి, నా తోబుట్టువులకు చెందాలి’ అని రాహుల్ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు దర్యాప్తు అధికారి సంజయ్ కుమార్ వెల్లడించారు.

Next Story