నెక్లెస్ రోడ్డులో మూసీ ఎక్స్ పీరియన్స్ సెంటర్

by Naga Rani Yarlagadda |

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో 'మూసీ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌' ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

నెక్లెస్ రోడ్డులో మూసీ ఎక్స్ పీరియన్స్ సెంటర్
X
  • ఫొటోలు, గ్రాఫిక్స్ రూపంలో సమాచారం
  • గాంధీ సరోవర్ ప్రాజెక్టు వివరాలు, సాహిత్యం
  • 1908వరదలు, పర్యావసానాలు
  • మూసీ పునరుజ్జీవనంతో పరిష్కారాలు
  • స్థలాన్ని పరిశీలించనున్న అధికారులు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో 'మూసీ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌' ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మూసీ నది సుందరీకరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వివరించడానికి, వారి నుంచి సూచనలు, అభిప్రాయాలను సేకరించడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సెంటర్ ను పర్మినెంట్ గా ఉండేలా ప్లాన్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే నెక్లెస్ రోడ్డులో దీని కోసం స్థలాన్ని పరిశీలించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి.

సెంటర్ ప్రత్యేకతలు..

మూసీ ప్రాజెక్ట్ భవిష్యత్తు రూపురేఖలు, చేపట్టబోయే అభివృద్ధి పనులను ఇందులో ప్రదర్శించనున్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రజలు తమ సలహాలు, అభిప్రాయాలను ఇక్కడ తెలియజేయడానికి అవకాశం కల్పించనున్నారు. మూసీ నదికి పూర్వవైభవం తీసుకురావడం, నది పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు లేదా పునరావాసం కల్పించడం, టీడీఆర్ రూపంలో పరిహారం అందజేయడం వంటి కార్యక్రమాలను సెంటర్ లో ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు మూసీ వికారాబాద్ లో ప్రారంభం నుంచి సూర్యపేటలోని కృష్ణానదిలో కలిసేవరకు చరిత్రను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.

1908 వరదలను..

మూసీ చరిత్రలో 1908లో హైదరాబాద్ లో సంభవించిన వరదల్లో మూసీ ఉగ్రరూపం, వరదల కారణంగా జరిగిన నష్టం, వరదలకు కారణాలు, వరదల్లో కీలకంగా వ్యవహరించిన చింత చెట్టు వంటి అంశాలను ప్రజలకు కళ్లకుకట్టినట్టుగా చూపించనున్నారు. దీంతోపాటు హైదరాబాద్ లో సంభవించిన వరదల తర్వాత ఉస్మాన్ సాగర్ (గండిపేట చెరువు)ను 1920లో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. దీంతోపాటు హిమాయత్ సాగర్ ను 1920లో నిర్మాణం ప్రారంభమై 1927లో పూర్తి చేశారు. 1908లో మూసీ నది వరదలు నగరాన్ని ముంచెత్తడంతో, భవిష్యత్తులో అలాంటి వరదలు రాకుండా నివారించడానికి, నగరానికి తాగునీటిని అందించడానికి జంట జలాశయాలను ఏర్పాటు చేశారు.

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు..

మూసీ కారణంగా మురుగు ప్రవాహం, నల్లగొండ జిల్లా వాసుల ధీనగాధలు, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రిభువనగిరి జిల్లాల ప్రజలు ఎదుర్కొకుంటున్న కష్టాలకు పరిష్కారం చూపించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు సంబంధించిన ఐదు దశల ప్రణాళికలు, ప్రజలకు కల్పించనున్న సౌకర్యాలు, అమ్యూజింగ్ పార్కులు, ల్యాండ్ స్కేపింగ్ ఏరియాలు, గాంధీ సరోవర్ ప్రాజెక్టులోని గాంధీ విగ్రహం, భారీ చరాఖ, గాంధీ సాహిత్యం, మ్యూజియం వంటి అంశాలను అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోనున్నారు.

మోడ్రన్ టెక్నాలజీతో..

మూసీ ప్రస్తుత పరిస్థితి…భవిష్యత్ లో చేపట్టబోయే పునరుజ్జీవనం ప్రాజెక్టు పరిస్థితిని ఫొటోలో రూపంతోపాటు గ్రాఫిక్స్ రూపంలోనూ ఏర్పాటు చేయనున్నాురు. దీంతోపాటు ఇతర దేశాల్లో నదుల పరిరక్షణ, ప్రక్షాళన, సుందరీకరణకు సంబంధించిన అంశాలను సైతం పొందుపర్చనున్నారు. ముఖ్యంగా నది ఆధారిత పట్టణాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి, టూరిజం అభివృద్ధి, ప్రజా రవాణ ప్రాజెక్టుల అభివృద్ది తీరును గ్రాఫిక్స్ రూపంలో అందించనున్నారు. దీంతోపాటు మూసీ గురించి ఫొటోల రూపంలో, గ్రాఫిక్స్ రూపంలో చూపించడంతోపాటు వాళ్లకు వివరించడానికి ప్రత్యేకంగా గైడ్లను సైతం అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.

Next Story