సంకల్ప్‌తో.. శిశు సంరక్షణ..!*

by Ratna Kumari |

నవజాత శిశు మరణాలను తగ్గించి ఆరోగ్యవంతమైన భవిష్యత్ తరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో 'సంకల్ప్' ప్రాజెక్టును అమలు చేస్తోంది.

సంకల్ప్‌తో.. శిశు సంరక్షణ..!*
X

దిశ, ఆదిలాబాద్ : నవజాత శిశు మరణాలను తగ్గించి ఆరోగ్యవంతమైన భవిష్యత్ తరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో 'సంకల్ప్' ప్రాజెక్టును అమలు చేస్తోంది.ఇందులో భాగంగా తెలంగాణలో ఎంపిక చేసిన జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.అడవులు, గిరిజన ప్రాంతాలు అధికంగా ఉండటంతో పాటు జిల్లాలో శిశు మరణాల రేటు జాతీయ సగటుతో పోలిస్తే ఎక్కువగా ఉండటంతో ఈ ఎంపిక జరిగింది. ఫిబ్రవరి-2024లో ప్రాజెక్టును ఎంపిక చేయగా, ఏప్రిల్-2024 నుంచి సమాచార సేకరణ ప్రారంభించారు.అనంతరం మే-2025 నుంచి క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలను అమలు చేస్తున్నారు.గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన దశ నుంచి నవజాత శిశువు పుట్టిన తర్వాత తొలి 28 రోజుల వరకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ చేపడుతూ శిశు మరణాలను తగ్గించే దిశగా వైద్యశాఖ,రిమ్స్ అధికారులు సంయుక్తంగా పనిచేస్తున్నారు.ప్రస్తుతం జిల్లాలో నమోదవుతున్న శిశు మరణాల సంఖ్యను 2027 నవంబర్ నాటికి సింగిల్ డిజిట్‌కు తీసుకురావడమే సంకల్ప్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.

పైలెట్ జిల్లాగా ఆదిలాబాద్..

దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యి జననాలకు సగటున 19 నవజాత శిశు మరణాలు నమోదవుతుండగా, ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంఖ్య 24గా నమోదైంది. ముఖ్యంగా గిరిజన, అటవీ ప్రాంతాలు అధికంగా ఉండటం, వైద్య సేవలు మారుమూల ప్రాంతాలకు పూర్తిస్థాయిలో అందకపోవడం వంటి అంశాలను గుర్తించిన ఐసీఎంఆర్ అధికారులు తెలంగాణలో ఆదిలాబాద్‌ను పైలెట్ జిల్లాగా ఎంపిక చేశారు. శిశు మరణాల తగ్గింపుతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నవజాత శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గర్భిణీలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతూ శిశు మరణాలను తగ్గించే దిశగా చర్యలు కొనసాగిస్తున్నారు.

ప్రసవాలపై ప్రత్యేక పర్యవేక్షణ..

సంకల్ప్ ప్రాజెక్టులో భాగంగా ఏప్రిల్-2024 నుంచి మే-2026 వరకు మొత్తం 24,510 ప్రసవాలను పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన దశ నుంచే ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి సరైన సమయంలో ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో రిమ్స్‌లో గత ఐదు నెలల్లో 1,956 ప్రసవాలు నమోదయ్యాయి. వీటిలో 1,208 సిజేరియన్ ప్రసవాలు, 748 సాధారణ ప్రసవాలు జరిగాయి.గర్భిణీ నుంచి నవజాత శిశువు తొలి 28 రోజుల వరకు ప్రతి దశలో వైద్య బృందం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది.

సింగిల్ డిజిట్‌దే సంకల్పం..

2024 సంవత్సరంలో జిల్లాలో 24 నవజాత శిశు మరణాలు నమోదుకాగా, ప్రస్తుతం ఈ సంఖ్య 21కు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.2027 నవంబర్ నాటికి ఈ సంఖ్యను సింగిల్ డిజిట్‌కు తీసుకురావడమే సంకల్ప్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.ఇందుకోసం ప్రస్తుతం రిమ్స్‌లో 20 పడకల ఎస్‌ఎన్‌సీయూ సేవలు అందుబాటులో ఉండగా, త్వరలో మరో 20 పడకలతో ఎంఎన్‌సీయూ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కంగారు మదర్ కేర్,ఎర్లీ బ్రెస్ట్ ఫీడింగ్, హైరిస్క్ గర్భిణీల ప్రత్యేక పర్యవేక్షణ వంటి చర్యలను అమలు చేస్తున్నారు.ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగు, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ సమక్షంలో ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జైసింగ్,జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి డాక్టర్ ఉపేందర్ జాదవ్,శిశు వైద్య నిపుణుడు డాక్టర్ వంశీకృష్ణతో పాటు ఇతర వైద్య అధికారులు పాల్గొని సంకల్ప్ ప్రాజెక్టు పురోగతి,జిల్లాలో శిశు మరణాల తగ్గింపునకు చేపడుతున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

శిశు మరణాల తగ్గింపే లక్ష్యం..

డాక్టర్ రాథోడ్ జైసింగ్, రిమ్స్ డైరెక్టర్,ఆదిలాబాద్..

ㅤసంకల్ప్ ప్రాజెక్టు ద్వారా గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన దశ నుంచి నవజాత శిశువు తొలి 28 రోజుల వరకు ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నాం. ప్రస్తుతం రిమ్స్‌లో 20 పడకల ఎస్‌ఎన్‌సీయూ సేవలు అందుబాటులో ఉండగా, త్వరలో మరో 20 పడకలతో ఎంఎన్‌సీయూ ప్రారంభించనున్నాం.2027 నవంబర్ నాటికి జిల్లాలో శిశు మరణాల సంఖ్యను సింగిల్ డిజిట్‌కు తీసుకురావడమే మా లక్ష్యం.అందుకోసం అందరి సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.

Next Story