- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు హక్కును హరించే బీజేపీ కుట్రను ఖండించండి : పోన్నం వెంకటేశ్వరరావు
ఓటు హక్కును హరించే బీజేపీ కుట్రలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు పోన్నం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.

దిశ, ఏన్కూర్: ఓటు హక్కును హరించే బీజేపీ కుట్రలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పేరుతో దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని, ఎస్‌ఐఆర్ పేరుతో జరుగుతున్న ఓట్ల తొలగింపును పార్టీ శ్రేణులు, ప్రజలు ఐక్యంగా అడ్డుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు పోన్నం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం సీపీఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఏన్కూర్ మండలం తిమ్మరావుపేట గ్రామంలోని మోతుకూరి గార్డెన్స్‌లో నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతుల్లో మూడో రోజు ఉదయం "పార్టీ నిర్మాణం - పని పద్ధతులు" అంశంపై పోన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎస్‌ఐఆర్ అమలు జరిగిన రాష్ట్రాల్లో భారీగా ఓట్లను తొలగించారని అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించి బీజేపీ కూటమి పార్టీలు లబ్ధి పొందాయని ఆరోపించారు.
బీజేపీ అనుబంధ సంస్థగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని అన్నారు. బీజేపీ వ్యతిరేకమైన మైనార్టీ, గిరిజన, దళిత, క్రైస్తవ ఓట్లను తొలగించేందుకు చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ పట్ల బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. అర్హత కలిగిన ఓట్లను కాపాడుకోవడంలో బూత్ లెవెల్ ఏజెంట్లే కీలకమని స్పష్టం చేశారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో పార్టీ శ్రేణులు, బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఓటరుకు ఫారాలు అందేలా కృషి చేయాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేపీ సర్కార్ చేపట్టిన కుట్రలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, రాష్ట్రంలో అర్హులైన ఓటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
ప్రపంచ యుద్ధాల ప్రభావంతో ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ పాలన చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలు సంక్షేమ పథకాల అమలును అధ్యయనం చేసి, అర్హులందరికీ న్యాయం జరిగే వరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఐక్య ఉద్యమాలే సామాజిక మార్పుకు పునాది : సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
సమాజంలో అసమానతలు, దోపిడీ, పేదరికానికి శాశ్వత పరిష్కారం వర్గ పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని, ప్రజల ఐక్య ఉద్యమాలే సామాజిక మార్పుకు పునాది అని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. సోమవారం ఏన్కూర్ మండలం తిమ్మరావుపేట గ్రామంలోని మోతుకూరి గార్డెన్స్‌లో నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతుల్లో మూడో రోజు మధ్యాహ్నం జరిగిన పార్టీ ప్లీనంలో "పార్టీ కర్తవ్యాలు" గురించి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై భారాలు మోపుతున్నాయని, కార్మికుల, కర్షకుల హక్కులను హరిస్తున్నాయని విమర్శించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వర్గ పోరాటాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఓటు హక్కును బలహీనపరిచే చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం ప్రజాస్వామ్యవాదులందరి బాధ్యత అని అన్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయ పరిరక్షణ కోసం ప్రజలను సమీకరించి ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని, ఓటరు జాబితాల సర్వేలో పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొని ఓటు హక్కును పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ రాజకీయ శిక్షణా తరగతులకు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదినేని రమేశ్, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, కొండబోయిన నాగేశ్వరరావు, ఏన్కూర్, కొణిజర్ల, సింగరేణి, కామేపల్లి మండలాల కార్యదర్శులు దొంతెబోయిన నాగేశ్వరరావు, చెరుకుమల్లి కుటుంబరావు, కుందనపల్లి నరేంద్ర, అంబటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు ఏల్పుల రాములు, ఇటికల లెనిన్, కాలసాని సాయి, రేగళ్ల తిరుమలరావు, షేక్ జానీ, కాట్రేల బిక్షం, భూక్యా లచ్చు, డివిజన్ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.






