పటాన్ చెరులో బీసీ కార్డు.. టీఆర్‌ఎస్​నుంచి పెరుగుతున్న ఆశావాహులు

by Web Desk |
పటాన్ చెరులో బీసీ కార్డు.. టీఆర్‌ఎస్​నుంచి పెరుగుతున్న ఆశావాహులు
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: ముందస్తు ప్రచారం తో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ఇందులో భాగంగా గ్రేటర్ ​పరిధిలో సంగారెడ్డి జిల్లా పటన్​చెరు సెగ్మెంట్​రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్​నుంచి గూడెం మహిపాల్​రెడ్డి ఎమ్మెల్యే గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సారి తమకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి గట్టి పట్టు తో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య నువ్వా..నేనా అనేలా సైలెన్స్ వార్​ కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉన్నాయని, ఈ జనరల్ స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని బీసీ లీడర్లు తెరమీదకు రావడం గమనార్హం.

రామచంద్రపురం కార్పొరేటర్​ పుష్ప నణేష్​, యువకుడు, ఉత్సాహవంతుడు చిట్కుల్​సర్పంచ్​ నీలం మధు లు తాము ఎమ్మెల్యే పోటీలో ఉంటామని రంగంలోకి దిగుతున్నారు. దీంతో అధికార పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ప్రధాన నాయకులు ఎవరికి అవకాశం వస్తుందో చూసుకుందామా..? అనే రేంజ్​లో పోటీ పడుతుండగా ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి కొత్త వారికి అవకాశం కల్పించాలని బీసీ నేతలు డిమాండ్​ చేస్తున్నారు. ఇద్దరు గొడవలు పడుతున్న నేపథ్యంలో తటస్తులకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్​భావిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం తో బీసీ నేతలు తమ ప్రచారానికి పదును పెడుతున్నారు. ఈ నలుగురు స్థానికులు కావడం, ఆర్థికంగా ఉన్న వారు కావడంతో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయని పబ్లిక్​ ఆసక్తిగా గమనిస్తున్నది.

ఎమ్మెల్యే వర్సెస్​ ఎమ్మెల్సీ

ఇప్పటికే పటాన్​చెరు నుంచి తిరిగి తనకు అవకాశం కల్పించాలని సిట్టింగ్​ ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి కోరనున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనకు తిరిగి అవకాశం కల్సిస్తాయనే ధీమాతో ఆయన ఉన్నారు. ఇదిలా ఉండగా ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి తమకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి గట్టి డిమాండ్​తో ఉన్నారు. తనకు కాకుంటే కోడలు భారతి నగర్ కార్పొరేటర్ సింధు, లేదా కొడుకు ఆదర్శ రెడ్డి కి ఇవ్వాలంటున్నాడు. సీఎం కేసీఆర్​ నుంచి మంత్రుల వరకు భూపాల్​రెడ్డి కి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఈ పేరుతో ఇప్పటి నుంచి ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రభుత్వ, ఇతర పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరు ఒకే వేదికపై నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ ఎవరికి వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లు వారిద్దరి సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వవద్దని భూపాల్​రెడ్డి తో పాటు అతని కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య అంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇద్దరు ఎవరికి వారు తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకోవడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ కార్యకర్తల నుంచి అందుతున్న సమాచారం. మొత్తంగా వీరిద్దరి వ్యవహారం లో నాయకులు, కార్యకర్తలు ఎటు తేల్చుకోలేక సతమతం అవుతున్నట్లు నిత్యం వారి పక్కనే ఉంటున్న వారు బయటకు రాగానే చెప్పుకుంటున్నారు.

యువత పేరుతో రంగంలోకి 'నీల మధు'..

అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్న పటాన్ చెరు నియోజకవర్గంలో ఈ సారి బీసీలకు అందులో యువతకు అవకాశం కల్పించాలని చిట్కుల్​ గ్రామ సర్పంచ్​ నీల మధు ఎమ్మెల్యే గా పోటీ కి సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్​ సర్పంచ్​గా కొనసాగుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. చిట్కుల్​వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్​గా పనిచేశారు. దాదాపు 7500 ఓటర్లున్న గ్రామ పంచాయతీ ప్రజలు మధును ఏకగ్రీవం సర్పంచ్​గా ఎన్నుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గ్రామాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. గతంలో మధు తల్లి రాధ కూడా వార్డు సభ్యురాలిగా, ఎంపీటీసీగా పనిచేశారు. కింది స్థాయి నుంచి వచ్చిన కుటుంబం.

మంత్రుల నుంచి స్థానిక పార్టీ కార్యకర్తల వరకు అందరితో ఆప్యాయంగా ఉంటారు. ఏం మధు అని ప్రతి ఒక్కరూ అభిమానంగా పిలుచుకుంటారు. ఇదిలా ఉండగా గత మే నెలలో తల్లి రాధ కరోనాతో మృతి చెందగా మరుసటి రోజే తండ్రి నిర్మల్​ కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. తల్లిదండ్రుల పేరుతో సొంత డబ్బులు వెచ్చించి చిట్కుల్​లో దుకాణం సముదాయం నిర్మిస్తున్నారు. ఇదే కాకుండా యువతకు క్రీడా పోటీలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. నియోజకవర్గ స్థాయిలో మంచి పేరున్న ఆయన పటాన్​చెరు ఎమ్మెల్యే బరిలో దిగుతున్నట్లు సన్నిహితులు ప్రచారం చేసుకుంటున్నారు.

జనంతో మమేకమై పనిచేస్తున్నామనంటున్న పుష్పానగేష్​

రామచంద్రపురం కార్పోరేటర్​గా పనిచేస్తున్న బూరగడ్డ పుష్పానగేష్ ​కూడా ఈ సారి ఎమ్మెల్యే బరిలో నిలవడానికి సిద్దం అవుతున్నారు. ఈ మేరకు తన సన్నిహితులు ప్రచారం చేసుకుంటున్నారు కూడా. స్థానికులైన పుష్పకు మంచి పేరుంది. 2009లో కూడా ఆర్సీ పురం కార్పొరేటర్ ​గా సమర్థవంతంగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. 2017 నుంచి 2018 వరకు పటాన్​ చెరు మార్కెట్​ కమిటీ చైర్మన్​గా పనిచేసి ప్రస్తుతం తిరిగి గత ఏడాది డిసెంబర్​నుంచి రామచంద్రపురం కార్పొరేటర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పుష్ప ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న రికార్డు ఉన్నది. భర్త నగేష్​ ఉమ్మడి జిల్లా గొల్ల కురుమ సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

నియోజకవర్గంలో గొల్ల కురుమల కు సంబందించినవే 35 నుంచి 40 వేల ఓట్లు ఉన్నాయని, ఈ క్రమంలోనే బీసీల మైన తమకు అవకాశం కావాలంటున్నారు. ఇప్పటికే ఓసీలకు అవకాశం కల్పించారు. ఓ సారి బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలని వారు మంత్రులు, ఇతర నేతల వద్ద మొరపెట్టుకుంటున్న ట్లు సమాచారం. రోజు వారీగా కాలనీల పరిశీలనకు వెళ్లినప్పుడు తాము బరిలో ఉంటామని పుష్ప ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆశావహులు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయం ఆసక్తిగా మారుతున్నది.


Next Story