- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ మోసాలకు బ్యాంకులదే బాధ్యత
సైబర్ మోసాలు ఇప్పుడు వ్యక్తులకే పరిమితం కాలేదు. దేశ ఆర్థిక వ్యవస్థకే పెను సవాలుగా పరిణమించాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : సైబర్ మోసాలు ఇప్పుడు వ్యక్తులకే పరిమితం కాలేదు. దేశ ఆర్థిక వ్యవస్థకే పెను సవాలుగా పరిణమించాయి. డిజిటల్ లావాదేవీలు విస్తృతమవుతున్న వేళ.. ఫిషింగ్ లింకులు, నకిలీ కాల్ సెంటర్లు, కేవైసీ అప్ డేట్, ఇన్వెస్ట్ మెంట్ యాప్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా యూపీఐ, ఆన్ లైన్ బ్యాంకింగ్ వేదికలే లక్ష్యంగా ఈ దోపిడీ సాగుతోంది. రోజురోజుకు ఫిర్యాదులు వెల్లువలా వస్తుండడంతో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా బాధితుల నష్టాన్ని తగ్గించేలా, బ్యాంకుల బాధ్యతను స్పష్టంగా నిర్ధారిస్తూ కేంద్ర హోంశాఖ సరికొత్త ‘ఎస్ఓవీ’ (స్టాండర్డ్ ఆపరేటింగ్ గైడ్ లైన్స్) నిబంధనలకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం రూ. 50 వేల లోపు మోసాలు జరిగినప్పుడు.. కోర్టు ఆదేశాలు అవసరం లేకుండానే బ్యాంకులు 90 రోజుల్లోపు బాధితులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు
చిన్న మొత్తాల్లో జరిగే మోసాలకు సంబంధించి బాధితులకు పరిహారం అందించాలని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీటీ) సమావేశంలో ప్రతిపాదించారు. దీని ప్రకారం బాధితులు నష్టపోయిన మొత్తంలో 85 శాతం లేదా రూ. 25 వేలు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించనున్నారు. అయితే ఈ పరిహారం జీవితకాలంలో ఒకసారి మాత్రమే పొందే అవకాశముంటుంది. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.
రూ. 52 వేల కోట్ల నష్టం
గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా ఆన్ లైన్ మోసాల వల్ల బాధితులు ఏకంగా రూ.52,976 కోట్లు నష్టపోయారని కేంద్రం వెల్లడించింది. ఆర్బీఐ డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 29,080 మోసాలు జరిగి. రూ. 1,457 కోట్ల నష్టం జరిగింది. 2024-25లో కార్డ్, ఇంటర్నెట్ ఆధారిత లావాదేవీలకు సంబంధించిన 13,469 మోసాల కేసులు నమోదు కాగా, వీటి వల్ల రూ. 520 కోట్ల నష్టం వాటిల్లిందని బ్యాంకులు నివేదించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం బాధితులకు వేగంగా ఊరటనిస్తాయని భావిస్తున్నారు.
ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు అధికంగా జరిగే హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ నిర్ణయం కీలకం కానుంది. ఇకపై పేమెంట్ సంస్థలు, స్టాక్ ట్రేడింగ్ యాప్‌లు సైబర్ నేరాలపై ఫిర్యాదు అందిన వెంటనే మూడంచెల వ్యవస్థలో స్పందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటేనే ఈ డిజిటల్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో తగ్గిన సైబర్ మోసాలు..
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ జాతీయ సగటును మించి మెరుగైన ఫలితాలను సాధిస్తుంది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు దాదాపుగా 24 శాతం పెరిగితే.. మన రాష్ట్రంలో మాత్రం 2025 లో ఫిర్యాదుల సంఖ్య 6 శాతం తగ్గింది. 2024లో 96,535 ఫిర్యాదులు నమోదు కాగా, 2025లో అవి 90,369కి తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక నష్టాలు కూడా 23 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. బాధితులు కోల్పోయిన నష్టం రూ.1,901 కోట్ల నుంచి రూ.1,524 కోట్లకు తగ్గింది. సైబర్ మోసాలకు సంబంధించి 2024, 2025 లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూ.534 కోట్లను ఫ్రీజ్ చేసింది. ఇందులో సుమారు 47 వేల మంది బాధితులకు రూ.367 కోట్లు తిరిగి చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు.
కొత్త ఎస్ఓవీ నిబంధనలు ఇలా..
- అనుమానాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించే వ్యవస్థలను బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి.
- కస్టమర్ ఫిర్యాదు అందిన వెంటనే ఖాతాలు ఫ్రీజ్ చేయాలి.
- మోసపోయిన మొత్తం తిరిగి పొందేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి.
- భద్రతా ప్రమాణాలు పాటించని బ్యాంకులపై జరిమానాలు విధిస్తారు.






