- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధిలేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించారే తప్ప వారిపట్ల ప్రేమ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధిలేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించారే తప్ప వారిపట్ల ప్రేమ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇప్పటికే 5 డీఏలు ఇయ్యలేదు. ఈ నెలతో 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నట్లు. ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగులకు 6 డీఏలు ఇయ్యకుండా పెండింగ్‌లో పెడితే.. ఆ రాష్ట్రంలో ఆర్థికమాంద్యం ఉన్నట్లు లెక్క. అంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని అంగీకరించాల్సి ఉంటది. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు పోతే ప్రభుత్వానికి కష్టం. మొత్తం 6 డీఏలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది తెలిసే ఒక డీఏ ఇచ్చి ఆ పరిస్థితి నుండి తప్పించుకున్నారే తప్ప ఆయన ఉద్యోగులకు ఒరగబెట్టిందేమీ లేదు’’ అని చెప్పారు. సోమవారం సిరిసిల్ల పట్టణం విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక శాంతినగర్‌లో బీజేపీ జెండాను ఆవిష్కరించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగించారు.
మళ్లీ ఎవరైనా కాంగ్రెస్‌కు ఓట్లేస్తారా?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. 6 గ్యారంటీలు అమలయ్యాయా? మహిళలకు నెలకు రూ.2500లు ఇస్తున్నారా? స్కూటీ ఇచ్చారా? వృద్ధులకు నెలకు 4 వేల పెన్షన్ ఇస్తున్నారా? నిరుద్యోగులకు రూ.4 వేల భ్రుతి ఇస్తున్నారా? 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా? ఏ ఒక్క హామీ ఇవ్వని కాంగ్రెస్ కు ఓట్లేస్తారా? ఓటుకు రూ.5 వేలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది? ఓట్లేస్తారా? ఆలోచించండి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేశారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘం నిధులతోపాటు రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం రూ.30 కోట్ల నిధులిచ్చింది. అట్లాగే అమ్రుత్ పథకం కింద రూ.104 కోట్ల నిధులిచ్చింది. మరి ఆ నిధులను ఏం చేశారు? పోనీ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సిరిసిల్ల మున్సిపాలిటీకి నయాపైసా అయినా ఇచ్చిందా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తాం
కేంద్రం ఇంత పెద్ద ఎత్తున నిధులిస్తే.. ఎన్నడైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు మోడీ ప్రభుత్వం పైసలిచ్చిందని చెప్పారా? లేదు.. పైగా అడుగుడుగునా బీజేపీ నేతలను ఇబ్బంది పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం తప్ప వారు సాధించిందేమిటి? ఇండ్లు ఇచ్చేది కేంద్రం, పైసలు తెచ్చేది మేమే. ఆ పార్టీలకు ఓట్లేస్తే ప్రయోజనం ఏముంది? ఆలోచించండి. కేంద్రం నిధులిస్తే సక్రమంగా ఖర్చు చేయకుండా అభివృద్ధి చేయకపోవడంవల్ల వర్షం వస్తే సిరిసిల్ల పట్టణం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. చివరకు కలెక్టరేట్ కూడా మునిగిపోయిన దుస్థితిని చూసినం. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నా. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చే పైసలకు అమ్ముడుపోయి ఓట్లేస్తే 5 ఏళ్లు నరకం తప్పదు. సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పగిస్తే అభివృద్ధి ఏమిటో చూపిస్తాం. మమ్ముల్ని గెలిపించిన సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మాటకారి
రాష్ట్రంలో, మున్సిపాలిటీలో బీజేపీకి అధికారం లేకపోయినా పెద్ద ఎత్తున సైకిళ్లను పంపిణీ చేసినం. ప్రభుత్వ ఆసుపత్రులకు కోట్ల రూపాయల మెడికల్ ఎక్విప్ మెంట్స్ ఇచ్చినం. వివిధ రూపాల్లో నిధులు ఖర్చు చేస్తున్నాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా. పువ్వు గుర్తుకు ఓట్లేస్తే ‘లక్ష్మీ దేవి’ మీ ఇంటికి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి నిధులు తీసుకొస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మాటకారి. ఉద్యోగస్తులకు ఇవాళ ఒక డీఏ ప్రకటించారు. అసలు విషయం ఏమిటంటే... ఇప్పటికే 5 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నెలతో 6 డీఏలు పెండింగ్ లో ఉన్నట్లు. ఇదే జరిగితే... రాష్ట్రంలో ఆర్ధిక మాంద్యం ఉన్నట్లు లెక్క. అంటే రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని అంగీకరించాల్సి ఉంటది. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు పోతే ప్రభుత్వానికి కష్టం. మొత్తం 6 డీఏలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది తెలిసే ఒక డీఏ ప్రకటించారే తప్ప ఉద్యోగులపై సీఎంకు ప్రత్యేక ప్రేమ లేదు. బ్యాంకు అకౌంట్లు ఉన్న ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఉంది. నిజంగా ప్రభుత్వం ప్రమాద బీమా ప్రకటిస్తే బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారో సమాధానం చెప్పాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పైసలు, దాచుకున్న సొమ్మును కూడా చెల్లించడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులపట్ల ప్రేమ ఒలకపోస్తుందంటే నమ్మేదెలా? అని ప్రశ్నించారు.
బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఇంకో దిక్కు, అల్లుడు మరో దిక్కు
బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేదు. కేంద్రంలో ఒక్క ఎంపీ గెలవలేదు. ఆ పార్టీకి ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి క్యాండిడేట్ కూడా దిక్కులేదు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉంటారో ఉండరో తెల్వని పరిస్థితి. బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఇంకో దిక్కు, అల్లుడు మరో దిక్కు. అసలు ఆ పార్టీ ఉంటదో ఉండదో తెల్వక కేసీఆర్ ఫాంహౌజ్‌లో పడుకుని తాగుకుంట పడుకుంటున్నడు. కేసీఆర్ కన్పించేది ఆసుపత్రిలో.. లేదంటే ఫాంహౌజ్‌లో తప్ప జనంలోకి వచ్చిందే లేదు. ఈసారి హైదరాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మేయర్ సీట్లు కైవసం చేసుకోవడంతోపాటు సిరిసిల్ల, వేములవాడసహా అనేక మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలు సాధించబోయేది బీజేపీయే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.






