- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికల్లో వారికే టిక్కెట్లు ఇస్తాం: బండి సంజయ్
కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా? లేదా? అనే దానిపై రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ కార్పొరేషన్(Karimnagar Corporation) స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా? లేదా? అనే దానిపై రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) అన్నారు. ఈసారి బీజేపీకి మంచి వాతావరణం ఉందని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకోవడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వారిని సాదరంగా ఆహ్వానించడంతోపాటు కలిసికట్టుగా పనిచేసి కార్పొరేషన్‌పై కాషాయ జెండాను ఎగరేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలిచే అవకాశమున్న చోట పార్టీ కార్యకర్తలకే టిక్కెట్లు ఇస్తామని పునరుద్ఘాటించారు.
బండి సమక్షంలో చేరికలు
ఈరోజు కరీంనగర్‌లోని ఈఎన్ గార్డెన్స్‌లో బీజేపీ నేతల సమావేశం జరిగింది. 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అలాగే 56వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి తన అనుచరులతో కలిసి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
పార్టీ నిర్ణయమే ఫైనల్
అనంతరం జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లరమేశ్, సీనియర్ నేతలు ఓదేలు, వాసాల రమేశ్, రాజేంద్రప్రసాద్, డాక్టర్ పుల్లెల పవన్, బోయినిపల్లి ప్రవీణ్, గుజ్జ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సదర్భంగా సమావేశానికి హాజరైన నాయకులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘బీజేపీలో పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీ కంటే పెద్దోళ్లు ఎవరూ లేరు. ఎవరున్నా లేకున్నా పార్టీ కొనసాగుతుంది. గతంలో ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండే. ఇప్పుడు వరుసగా 3 సార్లు అధికారంలో కొనసాగుతోంది.’’అని చెప్పారు. దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ వారసత్వ కుటుంబ రాజకీయాలతో దేశాన్ని కుంటుపడేసిందన్నారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో లేకుండా చేయడమే లక్ష్యంగా మోడీ నాయకత్వంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో కసితో పనిచేస్తున్నామని చెప్పారు.
అగ్రస్థానంలో కరీంనగర్
‘‘కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కసితో పనిచేస్తున్న జిల్లాల్లో కరీంనగర్ అగ్రస్థానంలో ఉంది. ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్‌లో కరీంనగర్ జిల్లా కార్యకర్తల భాగస్వామ్యం చాలా ఎక్కువ. కరీంనగర్ కార్యకర్తల సహకారం వల్లే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సక్సెస్ అయ్యాను. ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా? లేదా? అనే దానిపై రాష్ట్రమంతా ఎదురు చూస్తోంది’’అని పేర్కొన్నారు.
అందరం కలిసి పనిచేయాలి
‘‘బీజేపీకి అద్బుతమైన మంచి వాతావరణం ఉంది. ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నాయకులు రావడానికి సద్ధంగా ఉన్నారు. వాళ్లను రానీయకుండా కొందరు అడ్డుకోవాలనుకుంటున్నారు. ఇది సరికాదు. కరీంనగర్ మేయర్ సీటును బీజేపీ కైవసం చేసుకోవాలంటే... అందరం కలిసి పనిచేయాలి’’ అని బండి సంజయ్ కోరారు.
దేనికైనా తెగించడానికి సిద్ధం
కరీంనగర్ మేయర్ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని, అందుకోసం దేనికైనా తెగించడానికి సిద్దపడదామని చెప్పారు. ఎన్నడూ లేనివిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం తాకిడి ఎక్కువగా ఉందని, ఒక్కో డివిజన్‌కు 20 మందికిపైగా టిక్కెట్ ఆశిస్తున్నారని చెప్పారు. గెలిచే అవకాశమున్న చోట పాత కార్యకర్తలకే తప్పనిసరిగా టిక్కెట్లు ఇస్తామని, కష్టపడినా గెలిచే అవకాశం లేనిచోట ప్రత్యామ్నాయం చూస్తామని తెలిపారు. వివిధ సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లు ఇస్తామని, టిక్కెట్లు రానివారిని సముదాయించాల్సిన బాధ్యత జోన్ అధ్యక్షులు, పార్టీ నేతలపైనే ఉందని చెప్పారు. ‘‘వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలోకి వచ్చినా వాళ్లకే టిక్కెట్లు గ్యారంటీగా ఇస్తామనే అవకాశమే లేదు. అంతిమంగా సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లు కేటాయింపు ఉంటుంది’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.






