జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం.. ఆర్థిక సర్వే కీలక ప్రతిపాదనలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-29 09:23:34  IST  )

దేశం వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది.

జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం.. ఆర్థిక సర్వే కీలక ప్రతిపాదనలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశం వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇవాళ పార్లమెంటు వేదికగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే‌లో అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల (Overly Processed Foods) విషయంలో కఠిన ఆంక్షలను ప్రతిపాదించింది. చిప్స్, నూడుల్స్, పిజ్జా, బర్గర్లు, కూల్‌డ్రింగ్స్ వంటి జంక్ ఫుడ్ ప్రకటనలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీవీలు, ఇతర మీడియాలో ప్రసారం కాకుండా నిషేధించాలని సర్వే సూచించింది. భారత్‌లో అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాల అమ్మకాలు 2006లో 0.9 బిలియన్ డాలర్లు ఉండగా, 2019 నాటికి అవి 38 బిలియన్ డాలర్లకు పెరిగాయని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో దేశంలో పురుషులు మహిళల్లో ఊబకాయం రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు.

స్పష్టమైన న్యూట్రిషన్ లేబులింగ్ తప్పనిసరి..

ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార ప్యాకెట్లపై స్పష్టమైన న్యూట్రిషన్ లేబులింగ్ (Nutrition labeling) ఉండాలని ఎకనామిక్ సర్వే సిఫార్సు చేసింది. శిశువులు, చిన్న పిల్లలకు సంబంధించిన పాల ఉత్పత్తులు, పానీయాల మార్కెటింగ్‌పై కఠిన నియంత్రణలు ఉండాలని తెలిపింది. కేవలం ప్రజల అలవాట్లు మారితే సరిపోదని, ప్రభుత్వ పరంగా కఠినమైన నిబంధనలు, పాలసీలు అమలు చేయాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం వల్ల దేశ ఆర్థిక భవిష్యత్తు మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Next Story