సూర్యాపేటలో ‘బలగం’ సినిమా సీన్ రిపీట్.. పెళ్లిలో మటన్ ముక్క కోసం కొట్టుకున్న బంధువులు

by Jakkula.Mamatha |

సినిమాల్లో జరిగే విచిత్రమైన గొడవలు ఒక్కోసారి నిజజీవితంలోనూ రిపీట్ అవుతుంటాయి

సూర్యాపేటలో ‘బలగం’ సినిమా సీన్ రిపీట్.. పెళ్లిలో మటన్ ముక్క కోసం కొట్టుకున్న బంధువులు
X

దిశ,సూర్యాపేట/పెన్ పహాడ్: సినిమాల్లో జరిగే విచిత్రమైన గొడవలు ఒక్కోసారి నిజజీవితంలోనూ రిపీట్ అవుతుంటాయి. సరిగ్గా అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. బలగం సినిమాలో మటన్ ముక్కల కోసం గొడవ జరిగినట్లుగానే, ఇక్కడ కూడా పెళ్లి విందులో మటన్ కూర, మురుసు బొక్క ముక్కల కోసం ఇరువర్గాలు దాడులకు దిగాయి. చివరికి ఈ లొల్లి పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ వింత ఘటనకు జిల్లాలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనంతరం గ్రామంలో ఒక వివాహ వేడుక జరిగింది. పెళ్లి సమయం ముగిసిన తర్వాత మధ్యాహ్నం విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే, పెళ్లికొడుకు తరపు బంధువులు లంచ్ టైమ్‌కు కాకుండా కాస్త ఆలస్యంగా విందుకు చేరుకున్నారు. పెళ్లి కొడుకు బంధువులు ఆలస్యంగా వచ్చేసరికి విందులో మటన్ కూర దాదాపుగా అయిపోవచ్చింది.

పెళ్ళికొడుకు బంధువులు మేము భోజనానికి వచ్చేసరికి మటన్ కూరలో మురుసు బొక్కలు(ముక్కలు) వేయలేదు. అసలు లంచ్ సరిగ్గా వడ్డించడం లేదని పెళ్లి కూతురు బంధువులతో గొడవకు దిగారు.పెళ్లికూతురు బంధువులు లంచ్ టైమ్‌కు రాకుండా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? ఉన్నదాంట్లోనే సర్దుకోవాలి కానీ ఇలా గొడవ చేయడం ఏంటి అని వారు ఎదురు తిరిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగింది. చిన్నగా మొదలైన ఈ వాగ్వాదం కాస్త పెద్దదై, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. పెళ్లి మండపంలోనే పొట్టు పొట్టుగా కొట్టుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంధువులంతా చెల్లాచెదురయ్యారు. పెళ్లి వేడుక కాస్త రణరంగంగా మారడంతో ఇరుపక్షాల వారు పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశారు. దీంతో స్థానిక ఎస్సై గోపికృష్ణ ఇరువర్గాల పై కేసు నమోదు చేశారు. పెళ్లి బంధుత్వాలు కలుపుకోవాల్సిన చోట, కేవలం మటన్ ముక్కల కోసం కొట్టుకుని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story