- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి ఉత్తమ్‌ను బయట ఉంచి ముగ్గురు సీఎంల మధ్య సీక్రెట్ ఏంటి?: హరీశ్ రావు సెన్సేషనల్ కామెంట్స్
తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవంలో ముగ్గురు సీఎంల రహస్య భేటీ వివరాలను అసెంబ్లీ వేదికగా బయటపెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ముగ్గురు సీఎంల రహస్య భేటీ వివరాలు బయట పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ భేటీలో చారిత్రక ఒప్పందం అంటున్న రేవంత్ రెడ్డి ఆ వివారలు ప్రజలకు చెప్పాలన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు కర్ణాటకతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ భేటీలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయట కూర్చొబెట్టారని, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిని కూడా బయటే ఉంచేంత సీక్రెట్అందులో ఏముంది? మన రాష్ట్రానికి చెందిన ఇంజనీర్లు, మన ఈఎన్సీని కూడా లోపలికి ఎందుకు రానివ్వలేదని ప్రశ్నించారు. ఇంజనీర్లను, నీళ్ల మంత్రిని బైట ఉంచి మీరు ముగ్గురు గంటసేపు ఏం మాట్లాడుకున్నారో? దాని వల్ల తెలంగాణకు జరిగే ప్రయోజనం ఎందో అసెంబ్లీ వేదికగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
అఖిలపక్షానికి డిమాండ్:
కర్ణాటకతో ఒప్పందాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర భవిష్యత్ సీఆర్ పాటిల్ చేతిలో ఎలా పెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు ఏది చెబితే కేంద్రం అదే వింటుందని, చంద్రబాబు పలుకుపడితో ఏపీ వ్యక్తిని కేంద్ర ఇరిగేషన్ అధికారిగా నియమించారని ఆరోపించారు. నదీ జలాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి అజ్ఞానం.. నేడు తెలంగాణకు మరణ శాసనంగా మారిందన్నారు. కేసీఆర్ పోరాడి సాధించిన ప్రాజెక్టుల అనుమతులను గాలికి వదిలేసి.. తన రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని కర్ణాటక, ఏపీ అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణను ముంచుతుంటే.. అడ్డుకోవాల్సిన సీఎం వారితో కలిసి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ముంపు మేస్త్రివి కావొద్దు:
నదుల అనుసంధానం పేరిట ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేస్తూ.. తెలంగాణ సమ్మక్క సాగర్ ప్రాజెక్టును రేవంత్ బలిపెడుతున్నాడని కూలగొట్టే హైడ్రాకు 'హిట్లర్' స్ఫూర్తన్న రేవంత్ రెడ్డి.. మన నీళ్లు ఎత్తుకుపోతుంటే ఫిడేల్ వాయించిన 'నీరో చక్రవర్తి'లా చోద్యం చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో ఏకంగా 383 టీఎంసీల అనుమతులు సాధిస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్లలో కనీసం ఒక్క టీఎంసీకి కూడా అనుమతి సాధించలేదన్నారు. ట్రిబ్యునల్స్ ముందు గట్టిగా వాదనలు వినిపించి, మంచి లాయర్లను పెడితే 700-800 టీఎంసీలు సాధించే అవకాశముందన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు గుంపు మేస్త్రివి అయినా మాకు అభ్యంతరం లేదు కానీ తెలంగాణను ముంచే 'ముంపు మేస్త్రివి' కావద్దని సూచించారు.






