- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ ఇళ్ల శ్లాబ్ సైజులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతిఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి.. విడతల వారిగా లబ్ధిదారులకు అందిస్తోంది. తాజాగా.. ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఇళ్ల స్లాబ్ సైజు 500 నుంచి 750 అడుగులు మాత్రమే ఉండాలని పేర్కొంటూ గృహ నిర్మాణశాఖ కార్యదర్శి వీ.పీ.గౌతమ్ జీఓ విడుదల చేశారు. స్లాబ్ ముందువైపు మూడు అడుగులు, మిగతావైపు ఒక అడుగు మాత్రమే ఉండాలని జీఓలో స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి లబ్ధిదారులపై అదనపు ఖర్చు భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ విస్తీర్ణ పరిమితులను విధించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ వివరించింది. స్లాబ్ సైజులు పెంచడం వల్ల ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల ఆర్థిక సహాయం కంటే అదనపు ఆర్థిక భారం పడుతోందని హౌసింగ్ కార్పొరేషన్ అభిప్రాయపడింది. స్లాబ్ విస్తీర్ణం పెరగడం వల్ల లబ్ధిదారులకు ఖర్చు పెరుగుతున్నట్లు గుర్తించిన హౌసింగ్ కార్పొరేషన్.. ఈ నిర్ణయం తీసుకుంది.
సన్‌షెడ్లకు ప్రాధాన్యం
ఇళ్లకు నీడ అవసరమైతే అన్ని వైపులా స్లాబ్ పొడిగించే బదులు తలుపులు, కిటికీలపై సన్‌షెడ్లు (చజ్జాలు) ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇంటి ముందు భాగంలో అదనపు నీడ అవసరమైతే ఆర్‌సీసీ స్లాబ్‌కు బదులుగా జీఐ షీట్ ఆధారిత షెడ్లను ఏర్పాటు చేసుకోవాలని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు ప్రస్తుతం పునాది దశ, బేస్ లెవల్, గ్రౌండింగ్ లేదా ఇంకా నిర్మాణం ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.






