గురుకులాల్లో రూ.2వేల కోట్ల కుంభకోణం.. నన్ను చంపినా భయపడను : RS ప్రవీణ్

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర గురకులాల్లో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.

గురుకులాల్లో రూ.2వేల కోట్ల కుంభకోణం.. నన్ను చంపినా భయపడను : RS ప్రవీణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర గురకులాల్లో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్‌కు స్క్రిప్టు ఇచ్చి తమపై మాట్లాడించారని ఆరోపించారు. మఫత్‌లాల్, రమేశ్‌ జైన్, నిరంజన్ జైన్‌ను రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని.. బడ్జెట్‌లో రేవంత్‌రెడ్డికి ఎన్ని నిధులు పోతున్నాయో పెట్టాలన్నారు. ఫైల్స్ సంబంధిత శాఖ మంత్రుల వద్దకు వెళ్లడం లేదని.. వాటిపై సీఎం సంతకం చేస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలన అని బాకాలు ఊదుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ట్రంక్ బాక్సుల కాంట్రాక్టు డ్రగ్స్ సప్లయిర్ నిరంజన్ జైన్‌కు ఇచ్చారని ఆరోపించారు. ట్రంక్ బాక్సుల పేరుతో పిలల్లకు డ్రగ్స్ సప్లై చేయరని గ్యారెంటీ ఏముందని ప్రశ్నించారు. మఫత్‌లాల్‌కు వేం నరేందర్‌రెడ్డికి సంబంధం ఏంటని నిలదీశారు.

టెస్కో రాజేష్ అగర్వాల్ అనే వ్యక్తికి బట్టల సప్లై కాంట్రాక్టు ఇచ్చిందన్నారు. జులై 2వ తేదీన 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తామని.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ పెద్దలకు జైవీర్‌రెడ్డి, రమేష్ జైన్, నిరంజన్ జైన్ గన్నీ బ్యాగుల్లో డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అన్నింటిపైనా విచారణ చేస్తామని హెచ్చరించారు. తనపై ఇప్పటివరకు మూడుసార్లు హత్యాయత్నం జరిగిందని.. అయినా తనకు సెక్యూరిటీని తగ్గించారని అన్నారు. తన డ్రైవర్‌కు ఫోన్ చేసి కార్ తీసుకుని రమ్మన్నారని.. రేవంత్‌రెడ్డి సోదరుడికి నలుగురు గన్‌మెన్స్ ఇచ్చారని పేర్కొన్నారు. తిరుపతి‌రెడ్డి ఏమైనా తెలంగాణ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరా అని ప్రశ్నించారు. తాను మాట్లాడే అంశాలను రేవంత్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నారని.. తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తానంటే వద్దు అన్నానని.. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి వద్దని చెప్పానని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తనను చంపినా, చంపే ప్రయత్నం చేసినా భయపడనని సూచించారు.

Next Story