- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారులపై కావాలనే బదనాం.. ఆ ఆత్మహత్యాయత్నం ఒక డ్రామా!
ఇటీవల హుజురాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో చోటుచేసుకున్న మహిళ ఆత్మహత్యాయత్నం ఘటన ముమ్మాటికీ డ్రామా అని భూ విక్రయదారుడు ఆరోపించారు.

దిశ, హుజురాబాద్ రూరల్: ఇటీవల హుజురాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో చోటుచేసుకున్న మహిళ ఆత్మహత్యాయత్నం ఘటన ముమ్మాటికీ డ్రామా అని, అధికారులను ఇబ్బంది పెట్టేందుకే కావాలని కొందరు ఈ రాద్ధాంతం చేశారని భూ విక్రయదారుడు అంబాజీ, కొనుగోలుదారుడు నానాజీ ఆరోపించారు. శనివారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
నా భూమిపై నాకే సర్వహక్కులు ఉన్నాయి.. అంబాజీ
ఈ సందర్భంగా భూ విక్రయదారుడు అంబాజీ మాట్లాడుతూ.. "నాకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తిని నాకున్న అప్పులు తీర్చుకోవడం కోసమే అమ్ముకుంటున్నాను. నాకు తోడబుట్టిన వారు ఎవరూ లేరు. నా భూమిని అమ్ముకునే సర్వహక్కులు నాకు మాత్రమే ఉన్నాయి. కానీ, నా భూమిని కాజేయాలనే కుట్రతోనే రాజ్ కమల్, ఆయన తల్లి పద్మ కలిసి ఎమ్మార్వో ఆఫీసులో ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడారు. గతంలో రాజ్ కమల్ మూడు గుంటల భూమి కొంటానని చెప్పి, నా పాస్ పుస్తకం తీసుకువెళ్లి ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. ఈ విషయమై ఇప్పటికే సీపీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశాం" అని అంబాజీ తెలిపారు.
రిజిస్ట్రేషన్ ఆపడానికే ఈ కుట్ర.. నానాజీ
అనంతరం భూమి కొనుగోలుదారుడు నానాజీ మాట్లాడుతూ.. అంబాజీ వద్ద నుంచి ఒక ఎకరం భూమి కొనుగోలు చేయడానికి ఇప్పటికే 50 లక్షలు చెల్లించామని చెప్పారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం అంబాజీ అంగీకరించడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎమ్మార్వో కార్యాలయంలో చలానా కూడా కట్టామని వివరించారు. అంతలోనే రాజ్ కమల్ తన తల్లిని వెంటబెట్టుకొని వచ్చి కావాలనే గొడవ సృష్టించారని మండిపడ్డారు. "ఈ భూమి లావాదేవీలతో ఎమ్మార్వో, ఆర్డీవో అధికారులకు ఎలాంటి సంబంధం లేదు. అయినా అధికారులు డబ్బులు తీసుకున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. అసలు అధికారులకు లంచం ఇవ్వాల్సిన అవసరం మాకేంటి? అధికారులను బదనాం చేయడానికే రాజ్ కమల్ ఈ విధంగా ప్రవర్తించాడు. ఈ భూమితో రాజ్ కమల్‌కు ఎలాంటి సంబంధం లేదు. అధికారులు పూర్తి వివరాలు సేకరించి మాకు న్యాయం చేయాలి." అని భూమి కొనుగోలుదారుడు నానాజీ తెలిపారు.






