- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OpenAI: ఏఐ రేసులో భారత్‌కు మరింత ప్రాధాన్యం
సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టనున్న ఆయన, దేశంలో ఓపెన్ఏఐకి అత్యున్నత కార్యనిర్వాహక అధికారి(సీనియర్ లీడర్)గా వ్యవహరించనున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో విస్తరణను మరింత వేగవంతం చేసేందుకు ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఉబెర్ ఇండియా, దక్షిణాసియా మాజీ హెడ్ ప్రభ్‌జీత్ సింగ్‌ను భారత కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టనున్న ఆయన, దేశంలో ఓపెన్ఏఐకి అత్యున్నత కార్యనిర్వాహక అధికారి(సీనియర్ లీడర్)గా వ్యవహరించనున్నారు. యూజర్లను పెంచడం, కార్పొరేట్ భాగస్వామ్యాలను విస్తరించడం, ప్రభుత్వంతో సమన్వయం, విధానపరమైన చర్చలు, కార్యకలాపాల నిర్వహణ వంటి కీలక బాధ్యతలు ఆయన చేపట్టనున్నారు. 2025లో న్యూఢిల్లీలో తొలి కార్యాలయాన్ని ప్రారంభించిన ఓపెన్ఏఐ, భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ మార్కెట్లలో ఒకటిగా చూస్తోంది. శామ్ ఆల్ట్‌మన్ కూడా పలుమార్లు భారత్‌ను ఓపెన్ఏఐకి వ్యూహాత్మకంగా అత్యంత కీలక మార్కెట్‌గా అభివర్ణించారు.
ఇక, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన ప్రభ్‌జీత్ సింగ్‌కు భారతీయ మార్కెట్ పల్స్ బాగా తెలుసు. గత 11 ఏళ్లుగా ఉబర్ సంస్థను అంచెలంచెలుగా పెంచుతూ.. బైక్‌లు, ఆటోలు, కార్ల బుకింగ్స్‌తో 125కు పైగా నగరాలకు విస్తరించిన ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. గత ఆరేళ్లుగా భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక మార్కెట్లకు ఉబర్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. ఉబర్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన ఆయన, అంతకుముందు మెకిన్సీ అండ్ కంపెనీలో అసోసియేట్ పార్టనర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఓపెన్ఏఐ భారత మార్కెట్‌కు నాయకత్వం వహించనున్నారు. గ్లోబల్ ఏఐ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెంచుతున్న సమయంలో ఈ నియామకం జరగడం విశేషం. ఇటీవలే క్రెడ్ ఫౌండర్ కునాల్ షా గ్లోబల్ వాట్సాప్ బాస్‌గా ఎంపికై సంచలనం సృష్టించగా.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిగ్గజం ఓపెన్ఏఐ కూడా ఒక ఇండియన్ టాప్ లీడర్‌ను కంపెనీ కీలక బాధ్యతలకు ఎంచుకోవడం గమనార్హం.






