వీబీజీ రామ్‌జీ చట్టంపై తెలంగాణ సర్కార్ సమరం

by Ajay Maddhiboyina |

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టం–2025పై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని పేర్కొంటూ.

వీబీజీ రామ్‌జీ చట్టంపై తెలంగాణ సర్కార్ సమరం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టం–2025పై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని పేర్కొంటూ.. దీనిని న్యాయపరంగా, రాజ్యాంగపరంగా వ్యతిరేకించాలని నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సీతక్క ప్రత్యక్షంగా, మంత్రులు వివేక్, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. గ్రామీణ పేదల ఉపాధికి భంగం కలిగించేలా ఉన్న నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు. పథకం అమలులో 40 శాతం ఆర్థిక భారం రాష్ట్రంపై మోపి, నిర్ణయాధికారం మాత్రం కేంద్రం వద్దే ఉంచుకోవడం అన్యాయమని సబ్ కమిటీ తేల్చిచెప్పింది.

చట్టంలోని 60 రోజుల ఉపాధి విరామ నిబంధన ఆచరణ సాధ్యం కాదని, ఇది లక్షలాది కూలీల పొట్టకొట్టడమేనని మంత్రులు అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో జరగనున్న సమావేశంలో తెలంగాణ వాదనను బలంగా వినిపించాలని సబ్ కమిటీ నిర్ణయించింది. నార్మెటివ్ అలొకేషన్ కాకుండా, ఉపాధి హామీ చట్టం అసలు ఉద్దేశం ప్రకారం డిమాండ్ ఆధారిత నిధుల విడుదల జరగాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది. ప్రజాసంఘాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్న సబ్ కమిటీ, తన సిఫార్సులను జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమర్పించనుంది. అవసరమైతే ఈ అంశంపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది.

Next Story