రణరంగంగా బహదూర్‌గూడ..!

by Jakkula.Mamatha |

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్ గూడ రణరంగంగా మారింది.

రణరంగంగా బహదూర్‌గూడ..!
X

దిశ, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్ గూడ రణరంగంగా మారింది. గ్రామంలోని 650 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు పూనుకున్న ప్రభుత్వం హైడ్రాను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే వందలాది మంది పోలీసులు, అదేవిధంగా హైడ్రా రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని సర్వే నెంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నెంబర్ 62లో 500 ఎకరాలు మొత్తం 650 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వానికి రైతులకు మధ్య వివాదం చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 650 ఎకరాలను ఆధీనంలోకి తీసుకునేందుకు 10-07-2026 నాడు రాజేంద్రనగర్ ఆర్డిఓ హైడ్రాధికారులకు లేఖ రాశారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు భారీ సంఖ్యలో పోలీసులు హైడ్రా రెవెన్యూ అధికారులు బహదూర్ గూడ గ్రామానికి చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను ఇవ్వబోమని కొన్ని రోజులుగా దీక్షలు చేపట్టారు. వారికి పలు పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. శనివారం ఉదయం నుంచి భారీ యంత్రాలతో హైడ్రా అధికారులు ఫెన్సింగ్ పనులు చేపట్టారు. రైతులు అడ్డుకునే యత్నం చేయగా పోలీసులు వారిని నిలువరించారు. నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమకు సరైన పరిహారం ప్రకటించిన తర్వాతనే హైడ్రాధికారులు తమ భూములను స్వాధీనం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేయసాగారు. వారి డిమాండ్లను ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారులు ఫెన్సింగ్ పనులు చేస్తున్నారు.

నేతల అరెస్ట్..

బహదూర్ గూడ రణరంగంగా మారడంతో గ్రామానికి ఎవరిని రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోకల శ్రీనివాస్ రెడ్డిని మైలర్ దేవుపల్లిలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బహదూర్ గూడ గ్రామానికి చేరుకున్న రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు గ్రామంలో అడ్డుకున్నారు. ఈ పద్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story