నకిలీ దస్త్రాల వ్యవహారం.. పెద్దగొల్లగూడెం జీపీవో అనంతమ్మ సస్పెన్షన్!

by Jakkula.Mamatha |

దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం ఏజెన్సీలో వెలుగుచూసిన నకిలీ మరణ, వారసత్వ ధ్రువీకరణ పత్రాల వ్యవహారంలో జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది

నకిలీ దస్త్రాల వ్యవహారం.. పెద్దగొల్లగూడెం జీపీవో అనంతమ్మ సస్పెన్షన్!
X

దిశ, దమ్మపేట: దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం ఏజెన్సీలో వెలుగుచూసిన నకిలీ మరణ, వారసత్వ ధ్రువీకరణ పత్రాల వ్యవహారంలో జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. బతికున్న రైతును చనిపోయినట్లుగా చూపిస్తూ, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో భూమిని బదలాయించిన ఆరోపణలపై పెద్దగొల్లగూడెం గ్రామ పంచాయతీ అధికారి (జీపీవో) వి. అనంతమ్మను జిల్లా కలెక్టర్ అంకిత్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

తహసీల్దార్ పాత్రపై విచారణలో నిర్ధారణ..

కొత్తగూడెం ఆర్డీవో నిర్వహించిన క్షేత్రస్థాయి విచారణలో తహసీల్దార్ (ఎఫ్ఏసీ) కె. రామ్ నరేష్, జీపీవో అనంతమ్మలు ఇద్దరూ కుమ్మక్కై ఈ అవకతవకలకు పాల్పడినట్లు ప్రథమ దృష్ట్యా నిర్ధారణ అయిందని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. సర్వే నెం. 385/54 లోని 5 ఎకరాల భూమికి సంబంధించి బతికున్న పట్టాదారుడు మళ్ళా సత్యంను చనిపోయినట్లుగా పరిగణించారని తెలిపారు. సంబంధం లేని నామా పుష్పావతిని వారసురాలిగా గుర్తిస్తూ నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ద్వారా భూ భారతి పోర్టల్‌లో సక్సెషన్ మాడ్యూల్ కింద పాస్ పుస్తకం మంజూరు చేశారని వివరించారు. ఈ ఆమోద ప్రక్రియలో విధిగా చేయాల్సిన క్షేత్రస్థాయి విచారణను వారు ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని ఆర్డీవో నివేదికలో తేలినట్లు కలెక్టర్ వెల్లడించారు.

తీవ్రమైన విధి నిర్వహణ లోపం..

అధికారులిద్దరి చర్యలు తీవ్రమైన దుష్ప్రవర్తన, అధికార దుర్వినియోగం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని కలెక్టర్ ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు. టీజీసీఎస్(సీసీ అండ్ ఏ) నిబంధనలు 1991 ప్రకారం బాధ్యతను ఖరారు చేస్తూ తహసీల్దార్ రామ్ నరేష్, జీపీవో అనంతమ్మలపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని విచారణాధికారి సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో తొలుత జీపీవో అనంతమ్మను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో జీపీవో అనంతమ్మ దమ్మపేట కేంద్రంలోనే ఉండాలని, తన ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఆమెకు జీవనభృతి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ పాత్ర కూడా అధికారికంగా నిర్ధారణ కావడంతో తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story