Health : మెదడుకు మేత విటమిన్ సి.. గర్భిణులకు ఇంకా మంచిది!

by Javid Pasha |

విటమిన్ సి స్థాయిలు సరైన మోతాదులో ఉన్నప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నియంత్రణలో ఉంటుంది.

Health : మెదడుకు మేత విటమిన్ సి.. గర్భిణులకు ఇంకా మంచిది!
X

దిశ, ఫీచర్స్ : చాలామంది విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థకు సహాయపడుతుందని భావిస్తుంటారు. కానీ ఇది మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని మీకు తెలుసా? ఆరోగ్య నిపుణులు ఇదే చెబుతున్నారు. బయోకెమికల్ దృక్కోణంలో విటమిన్ సి న్యూరోట్రాన్స్‌మిటర్ల (నాడీ సంకేతాలు) సమన్వయంలో పాల్గొంటుంది. అందుకే మెదడు తనలో ఎప్పుడూ అధిక స్థాయిలో విటమిన్ సి ని మేనేజ్ చేస్తూ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇక దీని లభ్యతలో ఏవైనా అంతరాయాలు ఏర్పడితే న్యూరోకెమికల్ మార్గాలు ప్రభావితం అవుతాయని కూడా చెబుతున్నారు. అంటే.. విటమిన్ సి కేవలం యాంటీఆక్సిడెంట్ మాత్రమే కాదు, ఇది నాడీవ్యవస్థ పనితీరులో ముఖ్యమైన భాగమని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మెదడు ఆరోగ్యంపై ప్రభావం

విటమిన్ సి స్థాయిలు సరైన మోతాదులో ఉన్నప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇవి ఉండటం వల్ల న్యూరోట్రాన్స్‌మిటర్ల ఉత్పత్తి, నాడీకణాల మధ్య సంబంధాలు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నియంత్రణ వంటి ప్రక్రియలు సాఫీగా జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ సి విటమిన్ లోపం ఏర్పడితే మూడ్ స్వింగ్స్ ఏర్పడటం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.

గర్భిణులు తప్పక తీసుకోవాలి..

ఇది అందరికీ అవసరమే అయినప్పటికీ గర్భిణులు తప్పక తీసుకోవాల్సిన వాటిలో విటమిన్ సి కూడా ఒకటి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 19 సంవత్సరాలు పైబడిన వారికి రోజుకు సుమారు 85 mg విటమిన్ సి అవసరం. గర్భధారణ సమయంలో విటమిన్ సి కలిగిన ఆహారాలు లేదా డాక్టర్ల సిఫార్సు చేసిన సప్లిమెంట్లు తీసుకోవడంవల్ల కడుపులో బిడ్డ ఎదుగుదలకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ప్లాసెంటా ద్వారా విటమిన్ సి బదలాయింపునకు, ఐరన్ శోషణకు, రోగనిరోధక వ్యవస్థ మెరుగుదలకు ఇది చాలా సహాయపడుతుంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని అధిక మోతాదు(2000 mg పైన)లో తీసుకోవడం కూడా మంచిది కాదు. వీలైనంత వరకు ఆహారాల ద్వారా మాత్రమే దీనిని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఏయే ఆహారాల ద్వారా లభిస్తుంది?

విటమిన్ సి (ఆస్కార్బిక్ యాసిడ్) నీటిలో కరిగే విటమిన్ కాబట్టి రోజూ ఆహారం ద్వారా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయల ద్వారా ఇది సులభంగా లభిస్తుంది. నారింజ, ఉసిర (ఆమ్లా), స్ట్రాబెర్రీ, కివి, బొప్పాయ, జామకాయ, నిమ్మకాయ, ద్రాక్ష వంటి వాటిలో విటమిన్ సి లభిస్తుంది. ఇక కూరగాయల విషయానికి వస్తే.. క్యాప్సికం (బెల్ పెప్పర్), బ్రోకలీ, కాలీఫ్లవర్, టమాటో, బచ్చలకూర, బీట్‌రూట్ వంటి వాటిలో విటమిన్ సి లభిస్తుంది. ఆహారాల ద్వారా సరైన మోతాదులో పొందలేనప్పుడు శరీరంలో విటమిన్ సి లోపం ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు డాక్టర్లు రికవరీ అయ్యే వరకు సప్లిమెంట్లు వాడాలని సూచిస్తుంటారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story