ఫోటోలకే పరిమితమైన ‘బడిబాట’!

by Batti.Sumithra |

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, ప్రభుత్వ ఉచిత వసతుల పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బడిబాట’ కార్యక్రమం పెద్దేముల్ మండల కేంద్రంలో తూతూమంత్రంగా సాగుతోంది.

ఫోటోలకే పరిమితమైన ‘బడిబాట’!
X

దిశ, పెద్దేముల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, ప్రభుత్వ ఉచిత వసతుల పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బడిబాట’ కార్యక్రమం పెద్దేముల్ మండల కేంద్రంలో తూతూమంత్రంగా సాగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని నామమాత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫోటోలకే పరిమితం..

నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు గ్రామాల్లోకి వెళ్లి, విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న నాణ్యమైన విద్య, వసతులు, ఉత్తీర్ణత శాతం గురించి వివరించాలి. కానీ పెద్దేముల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లకుండా, కేవలం పాఠశాల మైదానంలో ఉన్నవారితో ఫోటోలు దిగి సరిపెట్టుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

తగ్గిన విద్యార్థుల సంఖ్య..

మండల పరిధిలోని గొట్లపల్లి సమీపంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మోడల్ స్కూల్ లో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గి ఆదర్శ పాఠశాల వెలవెల బోతోంది, ఇక్కడి సిబ్బంది కూడా నామమాత్రంగానే బడిబాట నిర్వహిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. దీనికి నిదర్శనంగానే పాఠశాల కళాశాలను కలిపి ప్రస్తుతం ఆ మోడల్ స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య కనీసం సుమారు 150 వందలు కూడా దాటకపోవడం గమనార్హం. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రచారం చేయకపోవడం వల్లే విద్యార్థుల సంఖ్య పడిపోతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్..

ప్రభుత్వ ఆశయాలను నీరుగారుస్తూ, కేవలం రికార్డుల కోసమే ఫోటోలు దిగుతూ కాలయాపన చేస్తున్న ఉపాధ్యాయుల పై ఉన్నతాధికారులు స్పందించాలని మండల ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story