- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేన పరాయి పార్టీ కాదు.. తెలంగాణ బిడ్డనే: డా. గడల శ్రీనివాస్ రావు
తెలంగాణ గడ్డపై జనసేన పార్టీ పురుడు పోసుకుందని అందుకే తెలంగాణ బిడ్డగా ప్రజల ఆశీర్వాదాలు కోరుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్, జనసేన నేత డా. గడల శ్రీనివాస్ రావు అన్నారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గడ్డపై జనసేన పార్టీ పురుడు పోసుకుందని అందుకే తెలంగాణ బిడ్డగా ప్రజల ఆశీర్వాదాలు కోరుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్, జనసేన నేత డా. గడల శ్రీనివాస్ రావు అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. జనసేన పార్టీ హైదరాబాద్ లోనే ప్రారంభమైందని అందుకే ఇది తెలంగాణ పార్టీ అని ఆయన భాష్యం చెప్పారు. పవన్ కళ్యాణ్‌కు ప్రాంతీయ భావాలు లేవని, తెలంగాణ ప్రజలకు అవసరమైన ప్రతిసారి జనసేన అండగా నిలుస్తుందని అన్నారు. ఆయన తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలే చేయలేదని... కొందరు కావాలని పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గిరిజన ప్రాంతం నుంచి వచ్చి మెడికల్ విద్యను అభ్యసించిన తాను ఎమ్మెల్యే, ఎంపీ పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. నీతి, నిజాయితీ, రాజకీయ జవాబుదారీతనం, ప్రజా కేంద్రీకృత పాలన తనను ఆకర్షించాయని... అందుకే నేను జనసేన పార్టీలో చేరినట్లు వెల్లడించారు. సామాజిక తెలంగాణ నిర్మాణమే జనసేన లక్ష్యమన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ అవకాశాలు కల్పించడంతో పాటు, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు చట్టసభల్లో తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా కృషి చేయాలని పార్టీ భావిస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి వర్గానికీ సమాన భాగస్వామ్యం ఉండాలని, సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధన కోసం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన రాజకీయ వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో జనసేన రాజకీయ వేదికను ఎంచుకున్నానని వివరించారు.
కోట్లాది మంది ప్రజలు పేదరికంలోనే మగ్గుతున్నారు...
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇంకా కోట్లాది మంది ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన జీవించడం బాధాకరమని గడల పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం సమర్థంగా అందిస్తే కార్పొరేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇంతగా విస్తరించే పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. ఒక కుటుంబంలో అనారోగ్య ఘటన జరిగినా ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అమలు కావడం లేదని, ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీల అమలుపై వెంటనే సమీక్ష చేసుకోవాలని డిమాండ్ చేశారు. యువత, మహిళలు, బడుగు బలహీన వర్గాల హక్కులు, సంక్షేమం కోసం జనసేన నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా జనసేన సైనికులు పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లో జవాబుదారీతనం తగ్గిపోయిందని, పొలిటికల్ ఎకౌంటబిలిటీ లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీతో కలిసి నడిచేందుకు రాజకీయ నాయకులు మందుకు రావాలని... అలాగే యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని జనసేన స్వాగతం పలుకుతోందని అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలకు ఆచరణాత్మక పరిష్కార మార్గాలు చూపిస్తూ సమగ్ర, సమానత్వ ఆధారిత సామాజిక తెలంగాణ నిర్మాణమే జనసేన ధ్యేయమని డా. గడల శ్రీనివాసరావు స్పష్టం చేశారు.






