Gold: ఒక్కరోజే రూ.4,300 పతనమైన బంగారం

by S Gopi |

అంతర్జాతీయంగా బంగారం ధరలు 11 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.

Gold: ఒక్కరోజే రూ.4,300 పతనమైన బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున పసిడి ధరలకు అంతర్జాతీయ మార్కెట్ గట్టి బ్రేక్ వేయడంతో, దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. బుధవారం ట్రేడింగ్‌లో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకునేలా దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 4,300 తగ్గి రూ. 1,49,100కు పడిపోగా.. కిలో వెండి ధర రూ. 4,347 కుప్పకూలి రూ. 2,50,000 వద్దకు చేరింది. గ్లోబల్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి విపరీతంగా పెరగడం, అంతర్జాతీయంగా బంగారం ధరలు 11 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ భారీ పతనానికి ప్రధాన కారణం అమెరికా వడ్డీ రేట్లపై పెరిగిన అంచనాలే. అమెరికా డాలర్ బాగా పుంజుకోవడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల అక్కడ ద్రవ్యోల్బణం మళ్లీ పెరగొచ్చనే భయాలు మొదలయ్యాయి. దీంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' వడ్డీ రేట్లను త్వరగా తగ్గించకపోవచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది. సాధారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే బ్యాంక్ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతారు కాబట్టి, ఎలాంటి స్థిర ఆదాయం (ఫిక్స్‌డ్ రిటర్న్స్) ఇవ్వని బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు వెనకడుగు వేస్తారు. దీనికి తోడు అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన తాజా టెన్షన్స్ కూడా మార్కెట్లో అనిశ్చితిని మరింత పెంచేశాయి.

ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 4,300 తగ్గి రూ. 1,47,870కి చేరగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 3,950 తగ్గి రూ. 1,35,450కి దిగొచ్చింది. వెండి సైతం రూ. 10,000 తగ్గడంతో కిలో రూ. 2.50 లక్షలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ గనక ఒక ఔన్సుకు 4,100 డాలర్ల మార్కు కంటే కిందకు పడిపోతే, ధరలు ఇంకా భారీగా తగ్గవచ్చని భావిస్తున్నారు. కేవలం బంగారం, వెండి మాత్రమే కాదు.. ప్లాటినం, పల్లాడియం లాంటి విలువైన లోహాల పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే డల్‌గా ఉంది. అయితే, ఈ గ్లోబల్ టెన్షన్స్ మధ్య కూడా 'రాగి' లాంటి పారిశ్రామిక లోహానికి మాత్రం డిమాండ్ తగ్గకపోవడం విశేషం.

Next Story