పేదోడి నడ్డీ విరుస్తున్న బీజేపీ

by Nallavelli.Anjaneyulu |

పేదోడి నడ్డి విరుస్తున్న బీజేపీ ని గద్దె దించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

పేదోడి నడ్డీ విరుస్తున్న బీజేపీ
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పేదోడి నడ్డి విరుస్తున్న బీజేపీ ని గద్దె దించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం టీపీసీసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద గల గాంధీ విగ్రహం వద్ద దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ధర్నా ఒక్కరోజు కార్యక్రమం మాత్రమే కాదని.. ఇది నిరంతర పోరాటానికి నాంది కావాలన్నారు. కేంద్రం విదేశీ ఒత్తిడులకు లోనై, ప్రజల సమస్యలను పట్టించుకోని పాలన సాగుతోందని, దేశ ప్రజలను బాధల్లోకి నెట్టే విధంగా బిజేపి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అందుకుంటున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజల్ని నలిపేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలపై భారం పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా పాలన సాగించిందని కితాబిచ్చారు. పన్నెండు సంవత్సరాల పాలన తర్వాత కూడా ప్రజల సమస్యలకు సరైన పరిష్కారాలు చూపలేకపోతున్నారని, మధ్యతరగతి, పేద వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, ధరల భారం పేదవాడి పైన పెరిగిపోయిందన్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో అందరినీ సమానంగా చూసే నాయకుడి అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా రాహుల్ గాంధీ కి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత, నగర మేయర్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, బుద్దారం సుధాకర్ రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సాయిబాబా, రాములు యాదవ్, సిజె బెనహర్ పాల్గొన్నారు.

Next Story